సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Mar 02, 2020 , 01:20:39

ఈ శాంతి మాకొద్దు!

ఈ శాంతి మాకొద్దు!
  • తాలిబన్లు అధికారంలోకి వస్తే మా హక్కులు హరిస్తారు
  • ఆఫ్ఘనిస్థాన్‌ మహిళల భయాందోళన
  • చదువుకు తావుండదు.. పనికి వీలుండదు
  • శాంతి కోసం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది

కాబూల్‌:  అమెరికా, తాలిబన్ల మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి వీచికలపై కొత్త ఆశలు చిగురింపజేయగా, అక్కడి మహిళల్లో మాత్రం భయాందోళనలను రేకెత్తిస్తున్నది. ఒప్పందం మేరకు అమెరికా సేనలు ఆఫ్ఘన్‌ను వీడనున్న నేపథ్యంలో దేశంలో మళ్లీ తాలిబన్లు రాజ్యమేలుతారన్న ఆందోళన వారిలో నెలకొన్నది. పోరాడి సాధించుఅమెరికా, తాలిబన్ల మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి వీచికలపై కొత్త ఆశలు చిగురింపజేయగా, అక్కడి మహిళల్లో మాత్రం భయాందోళనలను రేకెత్తిస్తున్నది. ఒప్పందం మేరకు అమెరికా సేనలు ఆఫ్ఘన్‌ను వీడనున్న నేపథ్యంలో దేశంలో మళ్లీ తాలిబన్లు  రాజ్యమేలుతారన్న ఆందోళన వారిలో నెలకొన్నది. పోరాడి సాధించుకున్న హక్కులు కోల్పోతామని మహిళలు ఆందోళన చెందుతున్నారు. శాంతి పవనాలను ఆస్వాదించేందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందేమోనన్న అనుమానం వారి మెదళ్లను తొలుస్తున్నది. స్వేచ్ఛను హరించే శాంతి తమకు అవసరం లేదని వారు చెప్తున్నారు. 

 

తాలిబన్ల అంతంతో మహిళల జీవితాల్ల్లో మార్పు

నిత్యం బాంబు పేలుళ్లు, తుపాకీ మోతలు, ఆత్మాహుతి దాడులతో ఏండ్లుగా రక్తపుటేర్లు పారుతున్న ఆప్ఘనిస్థాన్‌లో శాంతికి మార్గం సుగమం చేస్తూ తాలిబన్‌, అమెరికా మధ్య శనివారం చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. 2001లో అమెరికా దండెత్తే ముందు వరకు ఆప్ఘన్‌ను ఐదేండ్ల పాటు తాలిబన్లు ఉక్కుపిడికిలితో పాలించారు. షరియా చట్టాన్ని కఠినంగా అమలు చేశారు. మహిళల పరిస్థితి ఖైదీల మాదిరిగా తయారైంది. తాలిబన్‌ పాలన అంతం కావడంతో వారి జీవితాలు మారాయి.  


వెంటాడుతున్న భయం

 శాంతి ఒప్పందం కుదుర్చుకునే సమయంలో మహిళల హక్కుల పరిరక్షణపై తాలిబన్లు అస్పష్ట హామీ ఇచ్చారు. ఇస్లామిక్‌ విలువలకు అనుగుణంగా నడుచుకుంటామని చెప్పారు. దీనిపై భిన్న అర్థాలు వినిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో చాలా ప్రాంతాలు తాలిబన్ల నియంత్రణలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బాలికలను ప్రాథమిక పాఠశాలల్లోకి అనుమతిస్తున్నా.. మహిళలపై కొరడా ఝళిపించడం, బహిరంగంగా రాళ్లు విసరడం వంటి ఘటనలు జరుగుతుండడంతో తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వస్తే పాత కథే పునరావృతమవుతుందనే భయం వెంటాడుతున్నది. 


యువతరం మారింది..

తాలిబన్‌కు పుట్టినిల్లయిన కాందహార్‌కు చెందిన విద్యార్థిని పర్వానా హుస్సేనీ (17) స్పందిస్తూ.. ‘నేనేమీ ఆందోళన చెందడం లేదు. తాలిబన్లు ఎవరు? వాళ్లు మా సోదరులు. మేమంతా ఆప్ఘన్‌ ప్రజలం. మేం శాంతి కోరుకుంటున్నాం. యువతరం మారింది. తాలిబన్లు వారి సిద్ధాంతాలను తమపై రుద్దడాన్ని యువత ఒప్పుకోదు’ అని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే తాలిబన్‌ పాలనను చూసిన వారు మాత్రం.. వారు వస్తే ఆ చీకటి, బాధాకర జ్ఞాపకాలను తిరిగి తేవడం తప్ప మరేమీ జరుగదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ శాంతిని కోరుకుంటున్నారని, అయితే తాలిబన్ల పునరాగమనాన్ని కాదని చెప్తున్నారు. ఈ శాంతి తమకొద్దు అని పేర్కొంటున్నారు.


తాలిబన్లు ప్రజలను చంపడం ఆపేస్తారని, దేశంలో శాంతి నెలకొంటుందంటే నాకు సంతోషమే. అయితే ఆ మిలిటెంట్లు తిరిగి అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటన్నదే నా ఆందోళన. నువ్వు ఇంట్లోనే కూర్చో.. అని వారు చెప్తే నా పరిస్థితి ఏంటి? నా కుటుంబాన్ని ఎలా పోషించాలి. దేశంలో నాలాంటి వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వారందరి భయమూ ఇదే

- అక్రిమి, సేల్స్‌వుమన్‌


తాలిబన్లు తిరిగి అధికారంలోకి వస్తే మహిళల హక్కులపై ప్రభావం పడుతుంది. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు ఉండవు. తాలిబన్ల మనస్తత్వంలో ఎలాంటి మార్పు లేదు. వారి చరిత్రను చూస్తే.. నాకైతే ఆశలేదు. పనిచేసుకునే నాలాంటి మహిళలకు గడ్డు పరిస్థితి ఎదురుకానుంది

- తహెరా రెజాయ్‌,  కాబూల్‌

తాలిబన్‌ నాయకులతో త్వరలో సమావేశం: ట్రంప్‌

తాలిబన్‌ నేతలతో త్వరలోనే సమావేశం కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. తాలిబన్లు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని భావిస్తున్నానని చెప్పారు.  ట్రంప్‌ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆఫ్ఘన్‌ నుంచి తమ సైనికులను వెనక్కి రప్పించే సమయం ఆసన్నమైందని చెప్పారు. ఉగ్రవాద ఏరివేత బాధ్యతలను ఇక ఇతరులు చేపట్టే సమయం వచ్చిందని, అది తాలిబన్‌ కావచ్చు, ఆ చుట్టుపక్కల దేశాలు కావొచ్చని పేర్కొన్నారు. కాగా, శాంతి ఒప్పందానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. వచ్చేవారం అఫ్ఘన్‌ ప్రభుత్వం, తాలిబన్‌ మధ్య చర్చలు ప్రారంభం కావాల్సి ఉండగా, తాలిబన్‌ ఖైదీలను తాము విడుదల చేయబోమని ఆఫ్ఘనిస్థాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ ఆదివారం ప్రకటించారు. ఖైదీల విడుదల అన్నది చర్చల్లో భాగంగా ఉండాలి కానీ, ముందస్తు షరతుగా ఉండకూడదన్నారు. అమెరికా ఆ హామీ ఇవ్వాల్సింది కాదన్నారు.

logo