మంగళవారం 26 మే 2020
International - Apr 17, 2020 , 15:11:33

వైద్య సిబ్బంది సేవ‌లో స్వీడ‌న్ యువ‌రాణి

వైద్య సిబ్బంది సేవ‌లో స్వీడ‌న్ యువ‌రాణి

స్వీడన్‌: కరోనా మహమ్మారిపై ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్న వైద్య సిబ్బందికి సాయం చేయ‌డానికి స్వీడన్‌ యువరాణి, ప్రిన్స్‌ కార్ల్‌ ఫిలిప్‌ భార్య సోఫియా ముందుకొచ్చారు. తాను ఛైర్మ‌న్‌గా వ్యవహరిస్తున్న సోఫియామెట్‌ ఆస్పత్రిలోనే మూడు రోజుల ఇంటెన్సివ్‌ శిక్షణా కార్యక్రమాన్ని పూర్తిచేసి వాలంటీర్‌ అవతారమెత్తారు. అయితే ఆమె క‌రోనా బాధితుల‌కు నేరుగా సేవ‌లు అందించ‌ర‌ని, వైద్య సిబ్బందికి సహాయకురాలిగా ఉంటారని స్వీడ‌న్ రాయ‌ల్ కోర్టు ప్ర‌తినిధి మీడియాకు వెల్ల‌డించారు.

 

ఈ సంక్షోభ స‌మ‌యంలో యువరాణి తన వంతు బాధ్యతగా సేవ చేయాల‌ని నిర్ణయించుకున్నార‌ని, వైద్య సిబ్బందిపై అధిక భారం త‌గ్గించాల‌ని భావించారని రాయ‌ల్ కోర్టు ప్ర‌తినిధి తెలిపారు. కాగా, సోఫియామెట్‌ ఆస్పత్రి వైద్య సిబ్బందిపై అధిక భారం త‌గ్గించ‌డం కోసం వైద్యేతర సిబ్బందికి ఆన్‌లైన్‌లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. క్లీనింగ్‌, వంట చేయడం తదితర పనుల్లో వారికి శిక్షణ ఇస్తుంది. 

ఇప్పటివరకు 80 మంది శిక్ష‌ణ పూర్తిచేసుకుని సోఫియామెట్‌ ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. తాజాగా యువరాణి సోఫియా కూడా ఆ జాబితాలో చేరిపోయారు. ఇక నీలంరంగు ఆప్రాన్‌ ధరించిన సోఫియా ఫొటోలు రాయల్స్‌ ఆఫ్‌ స్వీడన్‌ ఇన్‌స్టా పేజ్‌లో షేర్‌ చేయగా.. ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తున్న‌ది.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo