స్టాక్‌హోమ్: స్వీడన్ ప్రధాని స్టీఫెన్ లోఫ్వెన్ తన పదవికి రాజీనామా చేశారు. స్టీఫెన్‌కు వ్యతిరేకంగా గత వారం ఆ దేశ పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దాంతో ఆయన తన పదవికి రాజీనామా చేయడానికి వారం రోజుల సమయం ఇచ్చారు. నేటికి వారం రోజుల గడువు పూర్తి కావడంతో స్టీఫెన్ తన పదవికి రాజీనామా సమర్పించారు. దాంతో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడంలో విఫలమై పదవిని పోగొట్టుకున్న తొలి స్వీడన్ ప్రధానిగా ఆయన అపఖ్యాతి మూటగట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరో వ్యక్తిని ప్రధానిగా ఎంపిక చేసుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమా..? లేదంటే ఎన్నికలకు వెళ్లాడమా..? అనే విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. కొత్తగా నిర్మించిన అపార్ట్మెంట్లకు అద్దె నియంత్రణలను తగ్గించే ప్రణాళిక విషయంలో ప్రభుత్వానికి, దానికి మద్దతు ఇస్తున్న లెఫ్ట్ పార్టీకి మధ్య విభేదాలు పొడసూపాయి. దీంతో అది ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది.
దీన్ని అవకాశంగా మలుచుకున్న నేషనలిస్ట్ స్వీడన్ డెమోక్రాట్లు పార్లమెంటులో ప్రధానిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మొత్తం 349 సీట్లు ఉన్న స్వీడన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 181 మంది చట్టసభ్యులు ఓటేశారు. దాంతో ప్రధాని స్టీఫెన్ సభ విశ్వాసాన్ని కోల్పోయారు.