బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 15, 2020 , 13:23:39

చైనా ఆక్రమణ గురించి వార్త రాసిన జర్నలిస్ట్ మృతి

చైనా ఆక్రమణ గురించి వార్త రాసిన జర్నలిస్ట్ మృతి

కఠ్మాండు : తమ గ్రామాన్ని చైనా ఆక్రమించిందని వార్త రాసిన నేపాల్ కు చెందిన ఓ జర్నలిస్ట్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఈ నెల 11 న కనిపించకుండా పోయిన ఆయన.. రెండు రోజుల తర్వాత చనిపోయి కనిపించారు.

నేపాలీ దినపత్రిక కాంతిపూర్ డైలీలో రిపోర్టర్గా పనిచేస్తున్న బలిరామ్ బనియా.. నేపాల్ కు చెందిన రూయి అనే గ్రామాన్ని చైనా ఆక్రమించిందని పూర్తి ఆధారాలతో వార్త కథనం అందించారు. ఈ గ్రామంలో గత 60 ఏండ్లుగా చైనా పాలన కొనసాగిస్తున్నదని, అయినప్పటికీ నేపాల్ ప్రభుత్వం దీనిని ఎప్పుడూ వ్యతిరేకించలేదని వార్తలో తెలిపారు. నేపాల్ ప్రభుత్వ అధికారిక పటంలో నేపాల్ సరిహద్దులోని ఈ గ్రామంలో కూడా చూపిస్తున్నదని, రూయి గ్రామ ప్రజల నుంచి పన్నులు వసూలు చేసినట్లు గూర్ఖా జిల్లాలోని రెవెన్యూ కార్యాలయంలో పత్రాలు కూడా దీనిని స్పష్టంచేస్తున్నాయని పేర్కొన్నారు. నేపాల్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే చైనా ఆక్రమించుకున్నదని రాసిన వార్తలో తెలిపారు.

ఇలాఉండగా, బలరామ్ బనియా అనుమానాస్పద పరిస్థితులలో మరణించారు. ఆగస్టు 11 నుంచి కనిపించకుండా పోయిన బలరామ్ బనియా.. 13న మండు జిల్లాలోని బాగ్మతి నది ఒడ్డున ఉన్న జలశక్తి ప్రాజెక్టు సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది. బనియా ముఖంలో గాయాలు ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. బనియా చివరిసారిగా గురువారం బాల్ఖు నది ఒడ్డున నడుస్తూ కనిపించినట్లు స్థానికులు చెప్తున్నారు. అతడి మొబైల్ ఫోన్ చివరి సిగ్నల్స్ ఇక్కడే ముగిశాయని తెలుస్తున్నది. బనియా అదృశ్యం గురించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. జర్నలిస్ట్ బలరామ్ బనియా అనుమానాస్పద మరణంపై ప్రభుత్వం దర్యాప్తు జరిపి దోషులను పట్టుకోవాలని నేపాల్ ప్రెస్ యూనియన్ డిమాండ్ చేసింది. 


logo