గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 17, 2020 , 15:17:21

పాక్‌లో కరోనా అనుమానితుడు మృతి

పాక్‌లో కరోనా అనుమానితుడు మృతి

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో కరోనా వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి సోమవారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు పంజాబ్‌ ఆరోగ్య శాఖ సెక్రటరీ కైసర్‌ షరీఫ్‌ అధికారికంగా వెల్లడించారు. లాహోర్‌లోని మయో ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో కరోనా లక్షణాలతో బాధపడుతున్న అనుమానితుడు చేరాడు. అతను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే సదరు వ్యక్తికి సంబంధించిన కరోనా వైరస్‌ పరీక్షల ఫలితాలు మంగళవారం మధ్యాహ్నానికి వచ్చే అవకాశం ఉంది. బాధితుడు ఇరాన్ వెళ్లి వచ్చినట్లు సమాచారం.

పాకిస్తాన్‌లో కరోనా కేసుల సంఖ్య 189కి చేరింది. సింధ్‌ ప్రావిన్స్‌లో అత్యధికంగా 155 కేసులు నమోదు అయ్యాయి. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో 10, పంజాబ్‌ ప్రావిన్స్‌లో 2, ఇస్లామాబాద్‌లో 2, కైబర్‌ ఫక్తుక్వాలో 15, గిల్గిట్‌ - బాల్టిస్తాన్‌లో 5 కేసులు నమోదైనట్లు పాక్‌ అధికారులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 158 దేశాలకు కరోనా వైరస్‌ వ్యాపించింది. 6,500లకు పైగా మృతి చెందారు. 1,70,000ల మందికి పైగా కరోనా వైరస్‌ బారిన పడ్డారు. 


logo
>>>>>>