ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Aug 13, 2020 , 15:45:38

ప్రీ ఓట్‌ సర్వేలో ముందున్న జో బిడెన్‌

ప్రీ ఓట్‌ సర్వేలో ముందున్న జో బిడెన్‌

వాషింగ్టన్‌ : అమెరికాలో 2020 నవంబర్‌లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. మూడొంతుల ఓటర్లు పోస్టు ద్వారా ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి. న్యూయార్క్ టైమ్స్ విశ్లేషణ ప్రకారం, అలాంటి ఓటర్లు సుమారు 80 మిలియన్లు ఉన్నారు. ఇవి అమెరికన్ చరిత్రలో అత్యధికం.. 2016 నాటి కన్నా రెట్టింపు. వాస్తవానికి, చాలా రాష్ట్రాలు కరోనా వైరస్ వ్యాప్తికి భయపడి పోస్టల్ ఓటింగ్ కోసం సన్నాహాలు చేశాయి. ఎన్నికలకు 100 రోజుల కన్నా తక్కువ సమయం మిగిలి ఉన్న పరిస్థితిలో ప్రచారం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు చూద్దాం.

ట్రంప్‌ను అధిగమించిన బిడెన్

అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జూలై 12 నుంచి ఆగస్టు 12 వరకు సుమారు 32 వేర్వేరు సర్వే ఫలితాలు వెలువడ్డాయి. వీటన్నిటిలోనూ డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్.. రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ పై పైచేయి కలిగివున్నట్లుగా తేలింది. అయితే ఈ సర్వేలలో ఇద్దరు అభ్యర్థుల మధ్య వ్యత్యాసం 5 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉండటం విశేషం. జాతీయ సగటులో బిడెన్ 51 శాతం ఓట్లు సాధించగా, ట్రంప్‌కు కేవలం 41 శాతం ఓట్లు వచ్చాయి. అంటే బిడెన్ కంటే 10 శాతం తక్కువగా ట్రంప్కు పోలయ్యాయన్నమాట. 91 శాతం డెమోక్రాట్ మద్దతుదారులు బిడెన్‌తో ఉండగా, 87 శాతం రిపబ్లికన్లు ట్రంప్‌తో ఉన్నారు. తనను వెనుకగా ఉన్నట్లు చూపిస్తున్న అన్ని సర్వేలను నకిలీవిగా పేర్కొనడమే కాకుండా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

నిధుల సేకరణలో ట్రంప్ ముందు

రెండు నెలల్లో తొలిసారిగా ట్రంప్‌కు ఎక్కువ విరాళాలు అందినట్లు గణాంకాలు చెప్తున్నాయి. జూన్ నెలలో ట్రంప్‌కు రూ.982 కోట్లు, బిడెన్‌కు రూ.1057 కోట్లు విరాళాలు అందగా.. జూలై నెలలో ట్రంప్‌కు అధికంగా రూ.1237 కోట్లు, బిడెన్‌కు రూ.1050 కోట్లు వచ్చాయి. సెప్టెంబర్‌లో 15 రాష్ట్రాల్లో బిడెన్ ఎన్నికల ప్రచారానికి డెమోక్రాటిక్‌ పార్టీ రూ.2100 కోట్ల రిజర్వ్ ఫండ్ ఏర్పాటు చేసింది. ఇందులో టీవీ ప్రకటనల కోసం రూ.1650 కోట్లు, డిజిటల్ ప్రకటనల కోసం రూ.450 కోట్లు ఖర్చు చేయనున్నారు. కాగా, టీవీలో ట్రంప్ ప్రచారం కోసం రూ.1085 కోట్లను రిపబ్లికన్‌ పార్టీ ఖర్చు చేయనున్నది. 

రానున్న రెండు నెలల్లో 3 అధ్యక్ష చర్చలు

అమెరికాలో నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు జరుగడానికి ముందు డొనాల్డ్‌ ట్రంప్, జో బిడెన్ మధ్య అధ్యక్ష చర్చలు జరుగుతాయని కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ (సీపీడీ) తెలిపింది. మొదటి చర్చ సెప్టెంబర్ 29 న ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో జరుగుతుంది. రెండవ చర్చ అక్టోబర్ 15 న ఫ్లోరిడాలోని మయామిలో.. మూడవ చర్చ అక్టోబర్ 22 న టేనస్సీలో జరుగుతుంది. అన్ని డిబేట్లు 90 నిమిషాలపాటు కొనసాగుతాయి. వైట్ హౌస్ పూల్ నెట్‌వర్క్ ఎటువంటి ప్రకటన లేకుండా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.


logo