గురువారం 22 అక్టోబర్ 2020
International - Oct 05, 2020 , 19:17:56

గవర్నర్‌ లక్ష్యంగా ఆఫ్ఘనిస్తాన్‌లో కారు బాంబు.. 8 మంది మృతి

గవర్నర్‌ లక్ష్యంగా ఆఫ్ఘనిస్తాన్‌లో కారు బాంబు.. 8 మంది మృతి

కాబూల్‌ : తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో సోమవారం మధ్యాహ్నం  ఆత్మాహుతి కారు బాంబు పేలింది. ఈ ఘటనలో నలుగురు పౌరులతోపాటు ఎనిమిది మంది మృతి చెందినట్లు సమాచారం. ఒక ప్రావిన్షియల్ గవర్నర్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ కారు బాంబును పేల్చినట్లుగా తెలుస్తున్నది. లాగ్మాన్ ప్రావిన్స్‌లో జరిగిన దాడిలో గవర్నర్ రహమతుల్లా యర్మాల్ క్షేమంగా బయటపడినట్లు అతని ప్రతినిధి అసదుల్లా దవ్లట్జాయ్ తెలిపారు.

గవర్నర్‌ కాన్వాయిని  లక్ష్యంగా చేసుకుని జరిపిన కారు బాంబు దాడిలో యార్మల్‌ బాడీగార్డ్స్‌ నలుగురు మరణించారు. మరో నలుగురు సైనికులు, పౌరులు చనిపోయారు. దాదాపు 38 మంది గాయపడినట్లు తెలిసింది. ఈ దాడి ప్రావిన్షియల్ రాజధాని మిహ్తెర్లాంలో జరిగింది. పేలుడు దాడి జరిగిన ప్రదేశంలో అనేక వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చిన్న పిల్లలు సహా గాయపడిన వారిని నగరంలోని ప్రధాన దవాఖానకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ దాడికి ఎవరూ వెంటనే బాధ్యత వహించలేదు. కాని, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, తాలిబాన్ రెండూ ఈ ప్రాంతంలో చురుకుగా ఉన్నాయి. రెండు ఉగ్రవాద గ్రూపులు గతంలో ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధులు, జాతీయ భద్రత, రక్షణ సిబ్బంది, పౌరులపై దాడులు చేశాయి. పొరుగున ఉన్న నంగర్‌హార్ ప్రావిన్స్‌లో శనివారం జరిగిన ఆత్మాహుతి ట్రక్ బాంబు దాడిలో 13 మంది మృతి చెందగా.. 38 మంది గాయపడ్డారు. 

ఆఫ్ఘన్ ప్రభుత్వం- తాలిబాన్ ప్రతినిధులు మధ్య ఖతార్లో అంతర్-ఆఫ్ఘన్ చర్చలు జరుగుతున్నాయి. తాలిబాన్లకు చాలా సంవత్సరాలుగా రాజకీయ కార్యాలయం ఉన్న ఖతార్ రాజధాని దోహాలో ఫిబ్రవరిలో సంతకం చేసిన అమెరికా- తాలిబాన్ శాంతి ఒప్పందం తరువాత.. దశాబ్దాల సుదీర్ఘ యుద్ధాన్ని ముగించడానికి ఈ చర్చలు ఉద్దేశించబడ్డాయి.


logo