శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 09, 2020 , 13:07:53

యూరోప్ నుంచే అమెరికాకు వైర‌స్ వ్యాపించింది..

యూరోప్ నుంచే అమెరికాకు వైర‌స్ వ్యాపించింది..

హైద‌రాబాద్‌:  అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ వ‌ల్ల సుమారు 14వేల మంది చ‌నిపోయారు. అయితే ఆ వైర‌స్ ప్ర‌ధానంగా యూరోప్ నుంచి న్యూయార్క్‌కు వ్యాపించిన‌ట్లు ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  దీనికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్ ఓ క‌థ‌నం రాసింది.  ఫిబ్ర‌వ‌రి నెల‌లోనే వైర‌స్ న్యూయార్క్‌కు చేరుకున్న‌ట్లు జ‌న్యు విశ్లేష‌ణ‌ ద్వారా ఓ అంచ‌నాకు వ‌చ్చారు. యూరోప్ నుంచి వ‌చ్చే ప్ర‌యాణికులే అమెరికాకు క‌రోనా వైర‌స్‌ను మోసుకువ‌చ్చిన‌ట్లు ఇచాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ప‌నిచేస్తున్న జ‌న్యుశాస్త్ర‌వేత్త హార్మ్ వాన్ బాకెల్ తెలిపారు. ఆ వ‌ర్సిటీ త‌మ స్ట‌డీ పేప‌ర్‌లో ఈ విష‌యాన్ని చెప్పింది. 

ఇక ఎన్‌వైయూ గ్రాస్‌మ్యాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కూడా ఇదే త‌ర‌హా అంచ‌నా వేస్తున్న‌ది.  రెండు వ‌ర్సిటీలు భిన్న‌మైన గ్రూపుల‌ను స్ట‌డీ చేసినా.. వైర‌స్ వ్యాపించింది మాత్రం యురోపియ‌న్ల నుంచే అంటూ నివేదికలు ఇచ్చాయి. మార్చి నెల‌లో న్యూయార్క్ బాధితుల నుంచి సేక‌రించిన వైర‌స్ జ‌న్యు క్ర‌మాన్ని స్ట‌డీ చేసిన త‌ర్వాత రెండు బృందాలు ఇదే అంచ‌నాకు వ‌చ్చాయి. 

ఎన్‌వైయూ ప‌రిశోధ‌కులు సుమారు 75 మంది కోవిడ్ పేషెంట్ల‌ శ్యాంపిళ్ల‌ను ప‌రిశీలించారు. అయితే ఆ జాబితాలో మూడ‌వ వంత రోగులకు యురోపియ‌న్ లింకులు ఉన్న‌ట్లు ప్రొఫెస‌ర్ ఆడ్రియానా హేగూ తెలిపారు.  బ్రిట‌న్‌తో పాటు ఫ్రాన్స్‌, ఆస్ట్రియా, నెద‌ర్లాండ్స్ లాంటి యురోపియ‌న్ దేశాల నుంచి న్యూయార్క్‌కు వైర‌స్ ప్ర‌బ‌లి ఉంటుంద‌ని ఆ ప్రొఫెస‌ర్ అంచ‌నా వేశారు.  

లాంగ్ ఐలాండ్‌కు చెందిన ఓ కేసును స్ట‌డీ చేసిన ప‌రిశోధ‌కులు మ‌రో విష‌యాన్ని వెల్ల‌డించారు. వాస్త‌వానికి ఆ వ్య‌క్తికి ఎటువంటి ట్రావెల్ హిస్ట‌రీ లేదు. కానీ ఆ వ్య‌క్తిలో ఉన్న వైర‌స్ జ‌న్యుక్ర‌మం మాత్రం ఇంగ్లండ్‌లో ప్ర‌బ‌లుతున్న వైర‌స్ మాదిరిగా ఉన్న‌ట్లు గుర్తించారు. అంటే ఆ స‌దురు పేషెంట్ బ్రిట‌న్ నుంచి వ‌చ్చిన వారితో కాంటాక్ట్ అయి ఉంటుంద‌ని ప్రొఫెస‌ర్లు భావిస్తున్నారు. ప్రతి రోజూ యూరోప్ నుంచి అమెరికాకు వ‌స్తున్న విమాన ప్ర‌యాణికుల వ‌ల్ల కూడా వైర‌స్ వ్యాప్తి చెంది ఉంటుంద‌ని భావిస్తున్నారు.  జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ లెక్క‌ల ప్ర‌కారం ఇప్ప‌టివ‌ర‌కు అమెరికాలో నాలుగున్న‌ర ల‌క్ష‌ల మందికి వైర‌స్ సంక్ర‌మించింది.
logo