బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Sep 01, 2020 , 14:54:18

దగ్గు రాకున్నా దగ్గితే కఠిన చర్యలు: బ్రిటన్‌ స్కూల్ కఠిన మార్గదర్శకాలు

దగ్గు రాకున్నా దగ్గితే కఠిన చర్యలు: బ్రిటన్‌ స్కూల్ కఠిన మార్గదర్శకాలు

లండన్‌: కరోనా వైరస్‌ వల్ల ప్రపంచం మొత్తం అన్నిరకాల కార్యకలాపాలు స్థంభించిపోయాయి. అందులో విద్యావ్యవస్థ ఒకటి. అయితే, ఇప్పుడిప్పుడే అన్నీ తెరుచుకుంటున్నాయి. పాఠశాలలు, కళాశాలలను కూడా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఓపెన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యావ్యవస్థను గాడినపెట్టేందుకు బ్రిటన్‌లో పాఠశాలలు కఠిన నిబంధనలు విధించాయి. కొవిడ్‌ పేరుతో ఎవరూ నాటకాలు ఆడకుండా.. ఇతరులకు భంగం కలగకుండా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశాయి. ఓ పాఠశాల నకిలీ దగ్గుపై తీవ్ర ఆంక్షలు విధించింది. అంటే దగ్గు రాకున్నా ఎవరైనా దగ్గినట్లు నటిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇది చర్చనీయాంశమైంది. 

ఆగస్టు 31 నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌లోని పాఠశాలలు కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాయి. అన్ని సంస్థలకు వారి క్యాంపస్‌లలో సామాజిక దూరం ఉండేలా పాటించాల్సిన కఠినమైన మార్గదర్శకాలు విడుదల చేశారు. కాగా, తూర్పు సస్సెక్స్‌లోని ఆర్క్ అలెగ్జాండ్రా అకాడమీ సరికొత్త నిబంధనలు పెట్టి వార్తల్లో నిలిచింది.  ‘కరోనా వైరస్‌ రెడ్‌లైన్స్‌’ పేరుతో ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. . ఏ సమయంలోనైనా ఉద్దేశపూర్వకంగా లేదా హానికరంగా దగ్గినా.. తుమ్మినా లేదా వైరస్‌ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినా చర్యలుంటాయి. అలాగే, సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఇందులో విద్యార్థి విఫలమైతే తరగతి నుంచి బహిష్కరిస్తారు.  ఈ నిబంధనలను లండన్‌లోని బైరాన్ అకాడమీ కూడా అనుసరిస్తోంది. కాగా, ఈ నిబంధనలు కొంత కఠినంగా ఉన్నా విద్యావ్యవస్థను గాడిలో పెట్టాలంటే తప్పదని అక్కడి నిపుణులు పేర్కొంటున్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo