మంగళవారం 19 జనవరి 2021
International - Dec 11, 2020 , 16:14:16

ప్రపంచంలోనే దృఢమైన బాలిక ఈమె!

ప్రపంచంలోనే దృఢమైన బాలిక ఈమె!

ఒట్టోవా: ఆమె వయస్సు ఏడేళ్లు.. ఎత్తు నాలుగు అడుగులు.. కానీ 80 కేజీల బరువును ఎత్తేస్తుంది. 61 కేజీల వెయిట్స్‌ ఎత్తుకుని స్క్వాట్స్‌ చేస్తుంది. అందుకే ఆ చిన్నారి ప్రపంచంలోనే దృఢమైన బాలిక. ఇప్పటివరకూ బతికున్న బాలురు, బాలికల్లోనూ ఈమే దృఢమైన కిడ్‌.  ఐదేళ్ల వయస్సునుంచే జిమ్నాస్టిక్‌ తరగతులకు హాజరవుతోందట. 

ఈ ఘనత సాధించింది కెనడా రాజధాని ఒట్టోవాకు చెందిన రోరీ వ్యాన్‌ ఉల్ఫ్‌. ఆమె వయస్సు ఇప్పుడు ఏడేళ్లు. ప్రతిరోజూ తొమ్మిదిగంటలు జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ తీసుకుంటుంది. నాలుగు గంటలు వెయిట్‌లిఫ్టింగ్‌ చేస్తుంది. వెయిట్‌ క్లాస్‌ చరిత్రలోనే ఆమె అత్యంత పిన్నవయస్సు కలిగిన యూఎస్‌ యూత్‌ నేషనల్‌ చాంపియన్‌. వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలకు వెళ్లినప్పుడల్లా ఆమె తన భుజంపై తాత్కాలిక టాటూలు వేసుకుంటుంది. ఎందుకని అడిగితే..వాటిని చూసినప్పుడలా తనకు ప్రశాంతంగా అనిపిస్తుంది.. కూల్‌గా ఉంటా.. అంటూ బదులిస్తోంది. 

రోరీ వ్యానీ ఉల్ఫ్‌ ఇటీవలే 30 కిలోల వెయిట్ క్లాస్‌లో యూఎస్‌ వెయిట్‌లిఫ్టింగ్ అండర్ -11, అండర్ -13 యూత్ నేషనల్ ఛాంపియన్‌గా నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత దృఢమైన చిన్నారి తన కూతురేనని ఆమె తండ్రి కావన్‌ సగర్వంగా చెబుతున్నాడు. ఇంత చిన్నవయస్సులో అంత బరువులు మోసేందుకు క్రమపద్ధతిలో శిక్షణ పొందుతున్నదని, ఆమెపట్ల తమకెలాంటి ఆందోళన లేదని అంటున్నాడు. ఇదిలా ఉండగా, రోరీ తనకు వెయిట్‌ లిఫ్టింగ్‌ కంటే జిమ్నాస్టిక్‌ అంటేనే ఇష్టమని చెబుతోంది. ఎందుకంటే జిమ్నాస్టిక్‌లో తలపై ఎలాంటి బరువులూ మోయాల్సిన పనిలేదుకదా అని అంటోంది. మనస్సును లగ్నం చేయడంవల్లే తాను అంత బరువులుమోయగలుగుతున్నానని అంటోంది ఈ దృఢమైన బాలిక.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.