శుక్రవారం 05 జూన్ 2020
International - May 09, 2020 , 15:58:00

ఇండియాలో చిక్కుకున్న ఫ్రెంచ్‌ ఫ్యామిలీ

ఇండియాలో చిక్కుకున్న ఫ్రెంచ్‌ ఫ్యామిలీ

లక్నో: విదేశీ యానం చేస్తూ ఇండియా పర్యటనకు వచ్చిన ఓ ఫ్రెంచ్‌ కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌లో  చిక్కుకుపోయింది. మహారాజ్‌గంజ్‌ జిల్లాలోని చిన్న పల్లెటూరు పుల్వా ధాలాలోని ఓ శివాలయంలో గత 50 రోజులుగా ఆశ్రయం  పొందుతున్నారు. గ్రామస్థులు ఇచ్చే పాలు, పండ్లు తీసుకొంటూ శివాలయం పూజారి పెట్టే కూరగాయల భోజనంతో పూటగడుపుతున్నారు. ఫ్రాన్స్‌లోని ఒక ఫార్మాస్యూటికల్‌ కంపెనీలో పనిచేసే పల్లారెస్‌.. విదేశీయానం  చేయాలని తలంచి భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి గత జూలై నెలలో ఇంటి నుంచి బయల్దేరారు. ఫ్రాన్స్‌ నుంచి టర్కీ, ఇరాన్‌, పాకిస్థాన్‌ మీదుగా ఈ కుటుంబం ఇండియా వచ్చింది.

ఇండియాలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి నేపాల్‌ వెళ్లేందుకు బయల్దేరగా మార్గమధ్యంలో కరోనా వ్యాప్తిచెంది లాక్‌డౌన్‌కు దారితీసింది. దాంతో ఈ ఫ్రెంచ్‌ కుటుంబం కాస్తా మార్గమధ్యంలోని పుల్వా ధాలా గ్రామంలో చిక్కుకుపోయారు. గ్రామశివారులోని శివాలయం  పూజారి వారిని చేరదీసి గుడిలో ఉండొచ్చని అభయమిచ్చాడు. దాంతో గత 50 రోజులుగా ఈ కుటుంబం అక్కడే ఉంటూ కేవలం  శాఖాహారంతోనే రోజులు గడుపుతున్నారు. శివాలయంలో ఉండటం వలన మాలో భక్తిభావం పెరిగిందని, ఏ ఒక్క రోజు కూడా మాంసం తినాలన్న కోరిక కలుగలేదని పల్లారెస్‌ చెప్పారు. లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే ఇక్కడి నుంచి నేపాల్‌ వెళ్లిపోతామంటున్నారాయన.


logo