బుధవారం 25 నవంబర్ 2020
International - Nov 13, 2020 , 03:08:55

ఫ్రిజ్‌లు లేకుండానే వ్యాక్సిన్లు నిల్వ

ఫ్రిజ్‌లు లేకుండానే వ్యాక్సిన్లు నిల్వ

వాషింగ్టన్‌: ఏ వ్యాధిగ్రస్థుడికైనా అత్యవసర వైద్యసేవలు అందించటంలో కీలకపాత్ర పోషించేవి వ్యాక్సిన్లే. కానీ వీటిని నిల్వచేయాలంటే కచ్చితంగా రిఫ్రిజిరేటర్లు ఉండాల్సిందే. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వ్యాక్సిన్లను తరలించటానికి కూడా రిఫ్రిజిరేటర్లు అవసరం. ఎందుకంటే వ్యాక్సిన్లను రెండు నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్దే నిల్వచేయాల్సి ఉంటుంది. కానీ ఇకనుంచి వ్యాక్సిన్ల నిల్వకు రిఫ్రిజిరేటర్ల అవసరం ఉండకపోచ్చు. వాటి అవసరం లేకుండానే వ్యాక్సిన్లు పాడవకుండా నిల్వచేయగల సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికాలోని మిషిగన్‌ టెక్నాలజీ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. సాధారణంగా వైరస్‌లను స్థిరపర్చి వ్యాక్సిన్లను తయారుచేస్తారు. అధిక ఉష్ణోగ్రత వద్ద ఆ వైరస్‌లు మళ్లీ క్రియాశీలం అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్లనే చల్లని ప్రదేశాల్లో వ్యాక్సిన్లను నిల్వచేస్తారు. అయితే, వ్యాక్సిన్లోని వైరస్‌లు క్రియాశీలం కాకుండా పట్టి ఉంచే సింథటిక్‌ ప్రొటీన్లను ఈ యూనివర్సిటీ పరిశోధకులు తయారుచేశారు. ఈ ప్రొటీన్లను వ్యాక్సిన్‌లో కలిపితే అధిక ఉష్ణోగ్రత వద్ద కూడా వైరస్‌ క్రియాశీలం అయ్యే అవకాశం లేదని పరిశోధనకు నేతృత్వం వహించిన క్యారిన్‌ హెల్ట్‌ తెలిపారు.