సోమవారం 01 జూన్ 2020
International - Apr 01, 2020 , 00:36:58

‘విశ్వమారి’ వాళ్లకు తెలియదు!

‘విశ్వమారి’ వాళ్లకు తెలియదు!

  • కరోనాకు దూరంగా జలాంతర్గముల్లోని సిబ్బంది 
  • విపత్తు వెలుగులోకి రాకముందే సముద్రాల్లోకి వెళ్లిన పలు సబ్‌మెరైన్లు 

లీపెక్‌క్యూ(ఫ్రాన్స్‌): దేశదేశాల్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి గురించి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. వ్యాధి వ్యాప్తి, బాధితుల సంఖ్య, చికిత్స తదితర అంశాలపై చర్చించుకుంటున్నారు. అయితే, సముద్రాల అట్టడుగున పహారా విధుల్లో ఉండే జలాంతర్గాముల్లోని సిబ్బందికి మాత్రం ఈ మహమ్మారి గురించి తెలిసే అవకాశంలేదని ఫ్రాన్స్‌ నౌకాదళ అధికారులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్‌ ఉద్ధృతంగా విస్తరించకముందే పలు దేశాల జలాంతర్గాములు సముద్ర ప్రవేశం చేశాయని, ఫ్రాన్స్‌ నుంచి ఫిబ్రవరి నెలలో 110 మంది సిబ్బందితో కొన్ని జలాంతర్గాములు సముద్రంలోకి వెళ్లాయని, అవి సుమారు 60 నుంచి 70 రోజులపాటు సముద్రంలోనే ఉంటాయని ఫ్రాన్స్‌ నేవీ ప్రతినిధి లెఫ్టినెంట్‌ కమాండర్‌ ఓలివియర్‌ రిబార్డ్‌ తెలిపారు. వాళ్లు ఫ్రాన్స్‌ను విడిచే సమయానికి దేశంలో కరోనా ప్రభావం అంతగా లేదన్నారు. 

క్రమంగా కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మార్చి 17న లాక్‌డౌన్‌ విధించామని.. ఈ విషయాలన్నీ ఏప్రిల్‌లో తిరిగి వచ్చిన తర్వాతే జలాంతర్గాముల్లోని సిబ్బందికి తెలిసే అవకాశం ఉన్నదని ఆయన తెలిపారు. కరోనా కారణంగా మారిన కొత్త ప్రపంచాన్ని వాళ్లు అప్పుడు చూడొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. విధి నిర్వహణలో ఉండే జలాంతర్గాముల్లోని సిబ్బంది, కమాండర్లు మానసిక ైస్థెర్యం కోల్పోకుండా ఉండేందుకు విషాద, భయానక సమాచారాన్ని వారికి చేరవేయమని బాలిస్టిక్‌ సబ్‌ మెరైన్‌ అధికారులు తెలిపారు.


logo