గురువారం 26 నవంబర్ 2020
International - Nov 17, 2020 , 11:15:51

చిన్న‌త‌నంలో రామాయ‌ణం, మ‌హాభార‌తం క‌థ‌లు విన్నా : బ‌రాక్ ఒబామా

చిన్న‌త‌నంలో రామాయ‌ణం, మ‌హాభార‌తం క‌థ‌లు విన్నా : బ‌రాక్ ఒబామా

హైద‌రాబాద్‌:  అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా కొత్త‌గా రాసిన ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్త‌కం గురించి అంద‌రికీ తెలిసిందే. అయితే ఆ బుక్ తొలి సంపుటి ఇటీవ‌ల రిలీజైంది. దాంట్లో ఇండియా గురించి ఆయ‌న కొన్ని ప్ర‌త్యేక అభిప్రాయాలు వెలుబుచ్చారు.  ఇండోనేషియాలో త‌న చిన్న‌త‌నం గ‌డిచింద‌ని, ఆ స‌మ‌యంలో హిందూ కావ్యాలు అయిన రామ‌య‌ణం, మ‌హాభారతంలో ఉన్న క‌థ‌ల‌ను విన్న‌ట్లు బ‌రాక్ ఒబామా తెలిపారు.  భార‌త్ అతిపెద్ద దేశ‌మ‌ని,  ఆరోవంతు ప్ర‌పంచ జ‌నాభా అక్క‌డే ఉన్న‌ద‌ని, ఆ దేశంలో సుమారు రెండు వేల స్థానిక తెగలు ఉన్నాయ‌ని, అక్క‌డ సుమారు ఏడు వంద‌ల‌కుపైగా భాష‌లు మాట్లాడుతుంటార‌ని ఒబామా త‌న పుస్త‌కంలో రాశారు.  

వాస్త‌వానికి అమెరికా అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టేంత వ‌ర‌కు ఆయ‌న ఇండియాను విజిట్ చేయ‌లేదు. 2010లో ఒబామా భార‌త్‌లో టూర్ చేశారు. కానీ త‌న ఊహాల్లో మాత్రం ఇండియాకు ప్ర‌త్యేక స్థానం క‌ల్పించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఇండోనేషియాలో త‌న బాల్యం గ‌డిచింద‌ని, ఆ స‌మ‌యంలో రామ‌య‌ణ‌, మ‌హాభార‌త క‌థ‌లు విన్నాన‌ని, తూర్పు దేశాల మ‌తాల‌పై ఆస‌క్తి వ‌ల్ల అలా జ‌రిగి ఉంటుంద‌ని, పాక్‌-ఇండియాకు చెందిన మిత్రులు త‌న‌కు ప‌ప్పు, కీమా వండ‌డం నేర్పించార‌ని,  బాలీవుడ్ సినిమాల‌కు కూడా అల‌వాటు అయ్యేలా చేశార‌ని ఒబామా త‌న పుస్త‌కంలో వెల్ల‌డించారు.  

ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్త‌కాన్ని రెండు భాగాల్లో ఒబామా రిలీజ్ చేయ‌నున్నారు.  తొలి పుస్త‌కంలో 2008 ఎన్నిక‌ల ప్ర‌చారం నుంచి తొలి ట‌ర్మ్ పూర్తి అయ్యే వ‌ర‌కు జ‌రిగిన కొన్ని ఆస‌క్తి అంశాల‌ను ఆ పుస్త‌కంలో రాయ‌నున్నారు. పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో ఒబామా బిన్ లాడెన్‌ను చంపిన ఘ‌ట‌న‌కు సంబంధించి డేరింగ్ ఆప‌రేష‌న్ గురించి దాంట్లో వివ‌రించ‌నున్నారు.  మంగ‌ళ‌వారం నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్త‌కం బుక్‌స్టోర్స్‌లో అందుబాటులోకి రానున్న‌ది.