సోమవారం 30 నవంబర్ 2020
International - Oct 27, 2020 , 02:25:31

6 కోట్ల మంది ఓటేశారు

6 కోట్ల మంది ఓటేశారు

  • అమెరికాలో బ్యాలెట్‌ ఓటింగ్‌కు విశేష స్పందన
  • కరోనా నేపథ్యంలో ముందస్తు ఓటింగ్‌కు మొగ్గు 
  • ఫలితాల ప్రకటన మరింత ఆలస్యమయ్యే ఛాన్స్‌
  • బిడెన్‌కే మద్దతిస్తున్న కీలక రాష్ర్టాల ఓటర్లు

న్యూయార్క్‌, అక్టోబర్‌ 26: మరో వారం రోజుల్లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం అధికార రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. అయితే, ఇప్పటికే 5.87 కోట్ల కంటే ఎక్కువ మంది అమెరికన్లు ‘మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్‌' ఓటింగ్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2016లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే, ఈ ఏడాది బ్యాలెట్‌ ఓటింగ్‌ సదుపాయాన్ని ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది ఎక్కువగా వినియోగించుకున్నారు. 2016లో 5.83 కోట్ల మంది బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది, సైన్యంలో పనిచేసే అధికారులు, అత్యవసర విభాగాల్లో పనిచేసే సిబ్బంది, వృద్ధులు, ప్రముఖులు తదితరులు ఎన్నికల రోజు కాకుండా అంతకు ముందే తమ ఓటు హక్కును ‘మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్‌' ద్వారా వినియోగించుకునే అవకాశం ఉన్నది. దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఎక్కువ మంది అమెరికన్లు ‘మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్‌' ఓటింగ్‌కే మొగ్గు చూపారని ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌ ఓ నివేదికలో వెల్లడించింది. బ్యాలెట్‌ ఓటింగ్‌ శాతం పెరుగడంతో ఓట్ల లెక్కింపుకు మరింత ఎక్కువ సమయం పట్టనున్నదని, దీంతో ఫలితాల విడుదల కూడా ఆలస్యం కావచ్చని వెల్లడించింది.

కీలక రాష్ర్టాలన్నీ బిడెన్‌ వైపే

అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా ఉండే రాష్ర్టాలను ‘బ్యాటిల్‌ గ్రౌండ్‌ స్టేట్స్‌' అంటారు. అమెరికాలో మొత్తం 50 రాష్ర్టాలు ఉండగా ప్రస్తుతం 14 రాష్ర్టాల్లో ట్రంప్‌, బిడెన్‌ మధ్య పోటీ ‘నువ్వా-నేనా’ అనే విధంగా ఉన్నది. అధ్యక్ష ఎన్నికల అంతిమ ఫలితాలను నిర్ణయించేవి కూడా ఈ రాష్ర్టాలే. 2016 అధ్యక్ష ఎన్నికల్లో మిగతా రాష్ర్టాల్లో మంచి ప్రదర్శన కనబరిచిన అప్పటి డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌.. ఈ 14 రాష్ర్టాల్లో ఎలక్టార్లను (స్థానాల్ని) గెలుచుకోవడంలో తడబడ్డారు. దీంతో ఆమె అధ్యక్ష పీఠానికి దూరమయ్యారు. అయితే, ఈ కీలక రాష్ర్టాల్లో ఇప్పటికే బ్యాలెట్‌ ద్వారా ఓట్లేసిన చాలా మంది ఓటర్లు తమ మద్దతు జో బిడెన్‌కే అని చెప్పినట్టు నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో ఫ్లోరిడా, నార్త్‌ కరోలినా తదితర రాష్ర్టాలు ఉన్నాయి.  

పోలింగ్‌ షెడ్యూల్‌

పోలింగ్‌ తేదీ: నవంబర్‌ 3

ఓటేయనున్న అమెరికన్లు: 24 కోట్ల మంది (ఇప్పటికే  5.87 కోట్ల మంది ఓటేశారు)

ఫలితాలు: నవంబర్‌ మొదటివారంలో

కొత్త అధ్యక్షుడి ప్రమాణం: జనవరి 20, 2021