మంగళవారం 04 ఆగస్టు 2020
International - Aug 02, 2020 , 17:42:56

ఐఎస్‌ఎస్‌ నుంచి క్రూడ్రాగన్‌ వచ్చేస్తోంది..

ఐఎస్‌ఎస్‌ నుంచి క్రూడ్రాగన్‌ వచ్చేస్తోంది..

వాషింగ్టన్‌: మానవసహిత అంతరిక్ష ప్రయోగాల్లోనే నాసా కొత్త చరిత్ర లిఖించబోతోంది. స్పేస్‌ ఎక్స్‌ అనే ప్రైవేట్‌ కంపెనీ రూపొందించిన వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లిన అమెరికాకు చెందిన ఆస్ట్రోనాట్లు భూమిపైకి తిరుగు పయనమయ్యారు. శనివారం రాత్రి నాలుగు డిపార్చూర్‌ బర్న్స్‌ తర్వాత రాబర్ట్‌ బెంకెన్‌, డగ్లస్‌ హార్లీతోకూడిన స్పేస్‌క్రాఫ్ట్‌ ది ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ (ఐఎస్‌ఎస్‌-అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)నుంచి విడిపోయి భూమి దిశగా ప్రయాణం ప్రారంభించినట్లు నాసా తెలిపింది.

ఫ్లోరిడాలోని నాసా కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి మే 30న ప్రైవేట్‌ వ్యోమనౌక స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా వీరిద్దరూ ఐఎస్‌ఎస్‌కు పయనమయ్యారు. ఆ తర్వాతి రోజు వీరు ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా చేరుకున్నారు. 63 రోజులపాటు వీరు దాదాపు వంద గంటలు ల్యాబొరేటరీలో పరిశోధనలో పాలుపంచుకున్నారు. దాదాపు రెండు నెలలు అంతరిక్షంలో గడిపిన వీరు ఇప్పుడు భూమి మీదకు  పయనమయ్యారు. ఆదివారం రాత్రి వరకు వారు ఫ్లోరిడాలోని పెన్సకోలా తీరంలో క్రూడ్రాగర్‌ నుంచి దిగనున్నారు. ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే మరో మూడు రోజులు వాయిదా వేయనున్నామని, అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసినట్లు నాసా వెల్లడించింది.

వ్యోమగాములతోపాటు బయోలాజికల్‌ షాంపిల్స్‌..

వ్యోమగాములతోపాటు ఈ క్రూడ్రాగన్‌లో కొన్ని బయోలాజికల్‌ షాంపిల్స్‌, మరికొన్ని రీసెర్చ్‌ పేపర్లను తీసుకొస్తున్నారు. వీటి బరువు దాదాపు 150 కిలోల బరువుంటుందని నాసా వెల్లడించింది. 2011 తర్వాత ఐఎస్‌ఎస్‌కు అమెరికా చేపట్టిన మానవసహిత ప్రయోగం ఇదే. కాగా, అప్పుడు విజయానికి గుర్తుగా వ్యోమగాములు అక్కడ వదిలిన అమెరికా జాతీయ జెండాను కూడా క్రూడ్రాగాన్‌ మోసుకొస్తోంది. అలాగే, ఇటీవల పంపిన ఎర్తీ, డైనోసార్‌ బొమ్మను కూడా తీసుకొస్తున్నారు. ఈ క్రూడ్రాగన్‌ ల్యాండింగ్‌ను నాసా లైవ్‌ టెలీకాస్ట్‌ చేయనుంది.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo