సోమవారం 01 జూన్ 2020
International - Apr 28, 2020 , 19:35:43

అంత‌రిక్షంలో పేరుకుపోతున్న వ్య‌ర్థాలు..

అంత‌రిక్షంలో పేరుకుపోతున్న వ్య‌ర్థాలు..

హైద‌రాబాద్‌: అంత‌రిక్షంలో వ్య‌ర్ధాలు పెరిగిపోతున్నాయి. అవ‌స‌రంలేని శాటిలైట్లు.. ఆకాశంలోనే ఉండిపోతున్నాయి. ఉప‌గ్ర‌హాల‌కు సంబంధించిన ప‌రిక‌రాలు.. కాలం చెల్లిన శాటిలైట్లు ఢీకొన‌డం వ‌ల్ల ఏర్ప‌డిన ముక్క‌లు.. అంత‌రిక్షంలో కుప్ప‌లు కుప్ప‌లుగా త‌యార‌వుతున్నాయి. ప్ర‌స్తుతం భూమి చుట్టూ సుమారు రెండు వేల ఉప‌గ్ర‌హాలు భ్ర‌మిస్తున్నాయి. మ‌రో మూడు వేల నిర్జీవ ఉప‌గ్ర‌హాలు ఉన్నాయి. అయితే ఈ లెక్క ప్ర‌తి ఏడాది ఆందోళ‌న‌క‌రంగా పెరుగుతున్నట్లు యురోపియ‌న్ స్పేస్ ఏజెన్సీ పేర్కొన్న‌ది.

కేవ‌లం ఉప‌గ్ర‌హాలే కాదు.. రాకెట్ల నుంచి కూడా వ్య‌ర్ధాల ముక్క‌లు అంత‌రిక్షంలో ఉండిపోతున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు 12 ఏళ్ల మిష‌న్ కోసం ప్ర‌యోగించిన ఓ శాటిలైట్‌.. త‌న కాల‌ప‌రిమితి ముగిసిన తర్వాత అది వ్య‌ర్థంగా మారుతోంది. కాని అది మ‌రో వ్య‌ర్థంతో ఢీకొట్టిన‌ప్పుడు.. వేల వేల ముక్క‌లు త‌యార‌వుతున్నాయి. ఇలా ఇప్పుడు అంత‌రిక్షంలో సుమారు 20 వేల భారీ వ్య‌ర్థాల ముక్క‌లున్నాయి. 

అంత‌రిక్ష వ్య‌ర్థాల‌తో ప్ర‌యోగాల‌కు పెద్ద‌గా ఇబ్బంది ఏమీ ఉండ‌దు. కానీ నిర్దేశిత క‌క్ష్య‌లో క‌నుక వ్య‌ర్థం ఉండిపోతే, అప్పుడు మ‌రో ప‌రీక్షకు క‌ష్టం ఎదుర‌వుతుంది. మరో శాటిలైట్‌ను డామేజ్ చేయ‌కుండా ఉండాలంటే.. కాలం ముగిసిన శాటిలైట్ ప‌క్కకు త‌ప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఉప‌గ్ర‌హాలు ఢీకొట్ట‌కుండా ఉండేందుకు ప్ర‌తి ఏడాది స్పేస్ ఏజెన్సీలు ర‌క‌ర‌కాల విన్యాసాలు చేస్తుంటాయి. అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం కూడా వ్య‌ర్థాల నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు త‌ప్పించుకుంటోంది.

ప్ర‌స్తుతం భూక‌క్ష్య‌లో దాదాపు రెండు వేల యాక్టివ్ శాటిలైట్లు ఉన్నాయి. మూడు వేల నిర్జీవ శాటిలైట్లు ఉన్నాయి. 10 సెంటీమీట‌ర్ల క‌న్నా పెద్ద సైజులో సుమారు 34వేల శాటిలైట్ వ్య‌ర్ధాల‌ ముక్క‌లు ఉన్నాయి. ఒక మిల్లీమీట‌ర్ క‌న్నా పెద్ద సైజున్న వ్య‌ర్థాలు సుమారు 128 మిలియ‌న్లు ఉన్నాయి. అయితే ప‌ది వేల వ్య‌ర్థాల్లో.. అవి ఒక‌సారి శాటిలైట్‌ను ఢీకొట్టే అవ‌కాశాలు ఉంటాయి. 1999 నుంచి అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం.. వ్య‌ర్థాల ఘ‌ర్ష‌ణను 25 సార్లు అడ్డుకున్న‌ది.

ఏ దేశ‌మైనా త‌మ మిష‌న్ పూర్తి అయిన 25 సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. భూ క‌క్ష్య నుంచి వ్య‌ర్థాల‌ను తొల‌గించాల‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి ఆయా దేశాల‌ను కోరింది. వాస్త‌వానికి ఈ నిబంధ‌న అమ‌లు చేయ‌డం క‌ష్ట‌మే. ఎందుకంటే కొన్ని శాటిలైట్లు విఫ‌లం అవుతాయి. అయితే ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించేందుకు కొన్ని కంపెనీలు ఒక్క‌ట‌య్యాయి. ఓ వినూత్న ఐడియాతో ముందుకు వ‌చ్చాయి. ఆ కంపెనీలు శాటిలైట్ గ్రూపుల‌ను ఏర్పాటు చేస్తున్నాయి.  భూమిపై ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను అందించేందుకు అవి ప్ర‌య‌త్నిస్తున్నాయి.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా సేవ‌లు అందించేందుకు స్పేస్ఎక్స్‌, అమెజాన్ సంస్థ‌లు ఉప‌గ్ర‌హాల‌ను ప్ర‌యోగించాల‌ని చూస్తున్నాయి. ఒక‌వేళ ఈ ప్ర‌ణాళిక స‌ఫ‌ల‌మైతే, అప్పుడు భూక‌క్ష్య‌లో మ‌రో 50వేల శాటిలైట్లు చేరుతాయి. అప్పుడు అంత‌రిక్ష ప్ర‌మాదాలు త‌ప్పించేందుకు కూడా మ‌రిన్ని కీల‌క విన్యాసాలు చేయాల్సి వ‌స్తుంది.


logo