శనివారం 30 మే 2020
International - Apr 22, 2020 , 01:31:24

కిమ్‌ ఆరోగ్యం క్షీణించిందా?

కిమ్‌ ఆరోగ్యం క్షీణించిందా?

  • ఉత్తర కొరియా అధినేత ఆరోగ్యంపై భిన్న కథనాలు
  • శస్త్ర చికిత్స అనంతరం అనారోగ్యం పాలయ్యారని వార్తలు
  • తోసిపుచ్చిన ఉత్తరకొరియా.. సమాచారంలేదన్న దక్షిణకొరియా  

సియోల్‌/ప్యాంగ్యాంగ్‌: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందా? ఇటీవల జరిగిన గుండె శస్త్ర చికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందా? అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌తో పాటు మరికొన్ని నివేదికలు వెల్లడించిన కథనాలు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కిమ్‌ తాతయ్య, ఉత్తర కొరియా నిర్మాతగా పేరుగాంచిన కిమ్‌ ఇల్‌ సంగ్‌ జయంతి వేడుకలు ఈ నెల 15న జరిగాయి. ఉత్తర కొరియాలో అత్యంత ప్రముఖంగా భావించే ఈ కార్యక్రమానికి కిమ్‌ గైర్హాజరయ్యారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు గుప్పుమన్నాయి. కివ్‌ు ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్టు ఓ అమెరికా ఉన్నతాధికారి చెప్పారని సీఎన్‌ఎన్‌ తెలిపింది. కాగా, కిమ్‌ ఆరోగ్యానికి సంబంధించి  ఎలాంటి సమాచారం లేదని దక్షిణ కొరియా తెలిపింది.  మరోవైపు, తమ అధ్యక్షుడి ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఉత్తరకొరియా తోసిపుచ్చింది. కిమ్‌ గైర్హాజరుకు రకరకాల కారణాలను ఊహించటం అసమంజసమని ప్రకటించింది. గుండెకు శస్త్ర చికిత్స తర్వాత కిమ్‌ కోలుకుంటున్నారని ఉత్తర కొరియా ఆన్‌లైన్‌ న్యూస్‌ పేపర్‌ ‘డైలీ ఎన్‌కే’ పేర్కొంది.


logo