చీజ్ అనగానే కొందరు ‘వద్దు వద్దు’ అంటూ చేతులు అడ్డంగా ఊపేస్తారు. కారణం, చీజ్‌లో ఫ్యాట్స్ ఉంటాయన్న భయం. నిజమే, చీజ్‌లో ఫ్యాట్స్ ఉంటాయి. మోతాదు మీరితే బరువు పెరగడమూ వాస్తవమే. అయితే, ఒక్క చీజ్ మాత్రమే కాదు, దేన్నయినా పరిమితికి మించి తీసుకుంటే కచ్చితంగా సమస్యలు వస్తాయి. అలాగని, చీజ్‌ను పూర్తిగా దూరం పెట్టకూడదు. లేనిపోని అనుమానాలు పెట్టుకోకుండా చీజ్ తినాలి. ఎందుకంటే, అందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది హార్మోన్ల అసమతుల్యతను నివారిస్తుంది. మూత్రపిండ రుగ్మతలను తగ్గిస్తుంది. క్యాల్షియం, ప్రొటీన్, మెగ్నీషియం, విటమిన్-ఎ, విటమిన్-డి, విటమిన్-కె, విటమిన్-బి12 ఇందులో పుష్కలం. ముఖ్యంగా, శాకాహారుల్లో బి-12 విటమిన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి వాళ్లు చీజ్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే, ఎర్రరక్త కణాలు, ప్రొటీన్లు సమృద్ధిగా అందుతాయి. డీఎన్ఏ మరమ్మతులోనూ ఇది ఉపకరిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని ప్రోబయాటిక్స్ సంజీవనితో సమానం. పిల్లలకు రోజు విడిచి రోజు చీజ్ ఇస్తే దంతాలకు మంచిది.