బుధవారం 03 జూన్ 2020
International - Apr 28, 2020 , 02:10:54

అమెరికాలో మన అపద్బాంధవులు

అమెరికాలో మన అపద్బాంధవులు

  • కరోనాపై పోరులో సైనికుల్లా భారత సంతతి వైద్యులు
  • అగ్రరాజ్యంలో ప్రతి ఏడో వైద్యుడు భారతీయుడే 
  • ఏఏపీఐ అధ్యక్షుడు సురేశ్‌రెడ్డి 

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 27: కరోనా విలవిల్లాడుతున్న అమెరికాలో భారత సంతతి వైద్యులు విశేష సేవలందిస్తున్నారు. అగ్రరాజ్యంలో రోగులకు చికిత్సనందిస్తున్న ప్రతి ఏడుగురు వైద్యుల్లో ఒకరు భారతీయుడేనని ‘భారతీయ సంతతి అమెరికా వైద్యుల సంఘం’ (ఏఏపీఐ) అధ్యక్షుడు, తెలంగాణవాసి సురేశ్‌రెడ్డి పేర్కొన్నారు. కొవిడ్‌-19ను అడ్డుకోవడానికి భారత సంతతి వైద్యులు సైనికుల్లా పోరాడుతున్నారని తెలిపారు. సోమవారం ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కరోనాపై పోరాటం దీర్ఘకాలం సాగుతుందన్నారు. లాక్‌డౌన్‌తో ప్రజల్లో పెరుగుతున్న అసహ నం, కోపాన్ని అర్థం చేసుకోగలనని అయితే, విశ్వమారి కట్టడికి ఇదే సరైన మార్గమని స్పష్టం చేశారు. దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని ప్రభుత్వాలకు సూచించారు. ముందస్తు ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే పరిస్థితులు ఇంకా దిగజారుతాయని హెచ్చరించారు. 

త్రిముఖ వ్యూహం ముఖ్యం

‘ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడం, రోగులకు వైద్య సిబ్బంది తగిన చికిత్స అందించడం, సాధారణ ప్రజలు క్రమశిక్షణతో నిబంధలను పాటించడం’.. ఈ మూడు సూత్రాలతో కరోనాను కట్టడి చేయొచ్చని సురేశ్‌రెడ్డి సూచించారు.

వెన్నుచూపని ధైర్యం

భారత సంతతి వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు కాపాడుతున్నారు. న్యూయార్క్‌లో భారత సంతతి వైద్యురాలు మాధవి ఇటీవలే వైరస్‌ సోకి మరణించారు. మూత్రపిండాల వైద్యురాలు ప్రియాఖన్నా ఇటీవలే న్యూజెర్సీ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. ఆమె తండ్రి, జనరల్‌ సర్జన్‌ సత్యేంద్ర ఖన్నా అదే దవాఖానలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఏఏపీఐ మాజీ అధ్యక్షుడు అజయ్‌ లోధాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈనెల మొదటి వారంలో న్యూజెర్సీలోని ఓ దవాఖానలో చికిత్స అందిస్తున్న భారత సంతతి వైద్యుడిపై కరోనా రోగి దాడి చేశాడు. ఆయన ముఖంపై వాంతి చేశాడు. దీంతో ఆయన వైరస్‌ సోకి మరణించారు. రోగుల దాడుల్లో పది మంది వైద్యులు గాయపడ్డారు. 

‘కాకతీయ’లో మెడిసిన్‌ 

సురేశ్‌ రెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లావాసి. కాకతీయ మెడికల్‌ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించారు. అమెరికాలో న్యూరో-ఇంటర్వెన్షనల్‌ రేడియాలజిస్టుగా స్థిరపడ్డారు. తొలుత అక్కడి తెలుగు మెడికల్‌ గ్రాడ్యూయేట్స్‌ సంఘానికి అధ్యక్షుడయ్యారు. 2019-20కిగానూ ఏఏపీఐకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉస్మానియా, గాంధీ, కాకతీయ, తెలంగాణ ఆఫ్‌ అమెరికా అలూమ్నీ అధ్యక్షుడిగా ఉన్నారు. 


logo