బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Feb 11, 2020 , 02:07:18

ఆదిత్యుడి ధ్రువాలపై గురి!

ఆదిత్యుడి ధ్రువాలపై గురి!
  • వ్యోమనౌకను ప్రయోగించిన ఈఎస్‌ఏ, నాసా

వాషింగ్టన్‌: సూర్యుడి గురించి మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు, మొట్టమొదటిసారిగా ధ్రువాల ఫొటోలను తీసేందుకు సోమవారం సోలార్‌ ఆర్బిటార్‌ అనే వ్యోమనౌక బయలుదేరింది. యురోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సహకారం అందిస్తున్నది. సోలార్‌ ఆర్బిటార్‌ను సోమవారం ఉదయం ఫ్లోరిడాలోని కేప్‌ కానవెరాల్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి నాసాకు చెందిన అట్లాస్‌-5 రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపించారు. ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.10.7 వేల కోట్లు. జర్మనీలోని ఈఎస్‌ఏ కేంద్రం నుంచి దీనిని నియంత్రించనున్నారు. రోదసిలోకి చేరిన తర్వాత వ్యోమనౌక సౌరఫలకాలు విచ్చుకున్నాయని, ఈ మేరకు సిగ్నల్స్‌ అందాయని ఈఎస్‌ఏ అధికారులు తెలిపారు. 


మరో రెండు రోజుల్లో వ్యోమనౌకలోని పలు పరికరాలు పనిచేయడం ప్రారంభిస్తాయని, యాంటెన్నాలు భూమితో అనుసంధానం అవుతాయని చెప్పారు. వ్యోమనౌక సూర్యుడిని చేరేందుకు దాదాపు రెండేండ్లు పడుతుందన్నారు. ఈ క్రమంలో మొత్తం 22సార్లు తన కక్ష్యను మార్చుకుంటుందని చెప్పారు. చివరగా సూర్యుడికి దాదాపు 42 లక్షల కి.మీ.ల దూరంలో ఉన్న బుధుడి కక్ష్యలోకి చేరుతుందన్నారు. అక్కడి నుంచి సూర్యుడిపై పరిశోధనలు చేస్తుందన్నారు. ఈ ఆర్బిటార్‌ సాయంతో సౌర తుఫాన్లకు గల కారణాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
logo
>>>>>>