సహారా ఎడారిలో ఈ వింత చూశారా?

అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో జనవరి వచ్చిందంటే చాలు.. మంచు దుప్పటి కప్పుకున్న ప్రకృతి మనల్ని అలరిస్తుంది. ఎక్కడ చూసినా తెల్లటి మంచు నురగలు మనకు దర్శనమిస్తుంటాయి. బయటకు వెళ్లాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇల్లు, ముంగిలి, కార్లు, వస్తువులు.. ఇలా ఒక్కటేంటి అన్నీ మంచుతో కప్పబడిపోతాయి. ఆకుపచ్చని చెట్లు తెల్లని చీర కట్టుకున్నట్లుగా కనిపిస్తాయి.
అదే, సహారా ఎడారిలో ఎండాకాలమైనా.. వానాకాలమైనా.. చివరకు చలికాలమైనా.. మండుటెండలు తప్పవు. ఎక్కడ చూసినా ఇసుకే దర్శనమిస్తుంది. ఎంత తిరిగినా చుక్క నీరైనా కానరాదు. ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ మనుషులకు దడ పుట్టిస్తుంటాయి.
అలాంటి సహారా ఎడారిలో ప్రస్తుతం మంచు కురుస్తున్నది. సన్నగా కురుస్తున్న మంచుతో ఎడారిలోని బంగారువర్ణంలోని ఇసుక తిన్నెలు శ్వేతవర్ణంలోకి మారిపోతున్నాయి. ఎప్పుడో 40 ఏండ్ల క్రితం ఇక్కడ మంచు కురిసినది చూశామని అక్కడి పెద్దవాళ్లు చెప్తుండగా.. వింతగా విన్న యువతరం.. అదే నేడు మంచు కురువడంతో సంతోషంతో మంచులో ఎగిరిగంతేస్తున్నారు. మంచు కురిసిన ఇసుకను చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.
సహారా ఎడారిలో హిమపాతం కురుస్తుండటంతో అక్కడ ఉష్ణోగ్రతలు -2 సెల్సియస్‌కు పడిపోయాయి. జనవరి 13 న అల్జీరియాలోని ఎడారి పట్టణం ఐన్ సెఫ్రాకు దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని మంచు దుప్పట్లు కప్పాయి. ఇక్కడ ఉష్ణోగ్రతలు -3 డిగ్రీలకు పడిపోయింది. ఊహించని ఈ దృశ్యాలను బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు ఎడారి వెంట పరుగులు తీస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.