శుక్రవారం 29 మే 2020
International - Mar 28, 2020 , 12:38:42

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కండోమ్‌ల‌కు తీవ్ర కొర‌త‌..

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కండోమ్‌ల‌కు తీవ్ర కొర‌త‌..


హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో కండోమ్‌ల ఉత్ప‌త్తి కూడా త‌గ్గింది. ప్ర‌పంచంలో అత్య‌ధిక సంఖ్య‌లో కండోమ్‌ల‌ను ఉత్ప‌త్తి చేసే కేరెక్స్ బెర్‌హాద్ సంస్థ దీనిపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. మ‌లేషియాకు చెందిన ఆ కంపెనీ గ‌త వారం నుంచి ఒక్క  కండోమ్‌ను కూడా ఉత్ప‌త్తి చేయ‌లేదు. ఆ కంపెనీకి మ‌లేషియాలో మొత్తం మూడు ఫ్యాక్ట‌రీలు ఉన్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అయిదుగురిలో ఒక‌రు వినియోగించేది ఆ కంపెనీ కండోమే. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఆంక్ష‌లు క‌ఠినంగా ఉన్నాయి. దీంతో కండోమ్‌ల ఉత్ప‌త్తి ఆగిపోయింది.  ఇప్ప‌టికే వంద మిలియ‌న్ల కండోమ్‌ల కొర‌త ఉన్న‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది. డ్యూరెక్స్ లాంటి మేటి బ్రాండ్‌ కండోమ్‌ల‌ను ఈ సంస్థ‌నే ఉత్ప‌త్తి చేస్తుంది. బ్రిట‌న్‌కు చెందిన ఎన్‌హెచ్ఎస్‌తో పాటు ఐక్య‌రాజ్య‌స‌మితి చేప‌ట్టే అనేక కార్య‌క్ర‌మాల‌కు ఈ కంపెనీ కండోమ్‌ల‌ను పంపిణీ చేస్తుంది. కండోమ్‌ల ఉత్ప‌త్తికి ఈ శుక్ర‌వారం అనుమ‌తి ఇచ్చినా.. కేవ‌లం 50 శాతం మాత్ర‌మే ఉత్ప‌త్తి అవుతున్న‌ది.  ప్రపంచ‌వ్యాప్తంగా కండోమ్‌ల కొరత ఏర్ప‌డ‌నున్న‌ట్లు ఆ ఫ్యాక్ట‌రీ సీఈవో తెలిపారు.  మ‌లేషియాలో ఇప్ప‌టి వ‌ర‌కు  మూడు వేల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 26 మంది మ‌ర‌ణించారు. పిల్ల‌లు కావాల‌నుకునేవారు.. వైర‌స్ ప్ర‌బ‌లుతున్న స‌మ‌యంలో.. త‌మ ప్రెగ్నెన్సీ ప్లాన్స్‌ను వాయిదా వేసుకోవాల‌ని ఇప్ప‌టికే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.


 

logo