మంగళవారం 31 మార్చి 2020
International - Feb 21, 2020 , 03:27:48

జర్మనీలో ఉన్మాది ఘాతుకం

జర్మనీలో ఉన్మాది ఘాతుకం
  • జాత్యహంకారానికి తొమ్మిది మంది బలి
  • మృతుల్లో టర్కీ దేశస్థులు, కుర్ద్‌ సంతతివారు

హనావు, ఫిబ్రవరి 20: జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నగర శివార్లలోని హనావులో జాత్యహంకార భావాలు గల ఓ ఉన్మాది విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో అతడు జరిపిన కాల్పుల్లో తొమ్మిదిమంది మృత్యువాత పడగా, పలువురు గాయపడ్డారు. తొలుత హనావులోని హుక్కాబార్‌లో కాల్పులు జరిపిన ఆ ఉన్మాది.. తరువాత పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. హుక్కాబార్‌లో తొలుత డోర్‌బెల్‌ కొట్టాడని, తలుపు తెరుచుకోగానే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని చెప్పారు. ఆ తరువాత అక్కడి నుంచి ఓ కారులో పారిపోయి ‘అరేనా బార్‌ అండ్‌ కేఫ్‌'కు చేరుకున్నాడని, అక్కడ కూడా డజను మందిపై కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాల్పుల విషయం తెలియగానే సాయుధ భద్రతా బలగాలు నగరాన్ని చుట్టుముట్టాయి. తొలుత ఉగ్రవాద దాడిగా భావించిన అధికారులు.. వెంటనే భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. హెలికాప్టర్లతో గాలింపు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల సహాయంతో దుండగుడు ప్రయాణించిన కారును వెంబడించగా, ఇంటి వద్ద తన తల్లితోపాటు అతడు విగతజీవునిగా కనిపించాడని జర్మనీలోని హెస్సీ రాష్ట్ర మంత్రి పీటర్‌ బ్యూత్‌ చెప్పారు. ఆ ఉన్మాది ఆత్మహత్య చేసుకోవడానికి ముందు 72 ఏండ్ల తల్లిని కూడా కాల్చి చంపినట్టు తెలుస్తున్నదని అన్నారు. దుండగుడిని టోబియాస్‌గా గుర్తించారు. ఉన్మాదికి సంబంధించిన వెబ్‌సైట్‌ను పరిశీలిస్తే అతడు జాత్యహంకారి అని, విదేశీయులంటే విముఖత చూపేవాడని తెలుస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. 24 దేశాల వారిని నిర్మూలించాలని అతడు కొన్ని పత్రాలలో రాసుకున్నాడని తెలిపారు. ఉన్మాది మొత్తం తొమ్మిది మందిని బలితీసుకున్నాడని చెప్పారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. జాత్యహంకారంతోనే అతడు కాల్పులు జరిపినట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తెలుస్తున్నదని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మృతుల్లో ఎక్కువ మంది టర్కీ దేశస్థులు, కుర్ద్‌ సంతతికి చెందిన వారని తేలింది.  


ఇది జాత్యహంకార విషం : మెర్కెల్‌

జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజిలా మెర్కెల్‌ ఉన్మాది కాల్పుల ఘటనను ఖండించారు. ఇది జాత్యహంకార విషం అని ఆమె వ్యాఖ్యానించారు. ‘జాత్యహంకారం ఓ విషం, ద్వేషం, ఈ విషం మన సమాజంలో విస్తరిస్తున్నది. దీనివల్లనే అనేక నేరాలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు. నాజీలు మళ్లీ పురుడు పోసుకుంటు ంటే వారిని మొగ్గలోనే తుంచేయాలని ఇంజే బ్యాంక్‌ అనే 82 ఏండ్ల వృద్ధురాలు వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీల ఘోరాలను తాను చూశానని, తన తల్లి కూడా ఒక బాధితురాలని చెప్పారు.


logo
>>>>>>