బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 29, 2020 , 02:08:53

అనారోగ్యంతో అబే రాజీనామా

అనారోగ్యంతో అబే రాజీనామా

  • పదవిని వీడిన జపాన్‌ ప్రధాని 
  • దేశ రాజకీయాల్లో పలు రికార్డులు సృష్టించిన నేత 

టోక్యో: అనారోగ్యం కారణంగా జపాన్‌ ప్రధాని షింజో అబే తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా శుక్రవారం ప్రకటిస్తూ.. తన పదవీకాలం పూర్తి చేయలేకపోయినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రాజకీయ నిర్ణయాలు తీసుకునే సమయంలో తన అనారోగ్యం వల్ల ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే రాజీనామా చేసినట్టు తెలిపారు. పెద్ద పేగులో కణితి ఏర్పడటంతో అబే చాలా ఏండ్లుగా చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్టు తెలుస్తున్నది. షింజో అబే 2012లో రెండోసారి జపాన్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014, 17లలో జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించి ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. ఆయన పదవీకాలం వచ్చే ఏడాది సెప్టెంబరులో ముగియాల్సి ఉన్నది. జపాన్‌లో ప్రధాని పదవిలో అత్యంత కాలం కొనసాగిన నాయకుడు షింజోఅబేనే. అబే మొట్టమొదటిసారి 2006లో జపాన్‌ చరిత్రలోనే అత్యంత చిన్న వయస్సులో(52) పధాని పదవిని చేపట్టారు. అయితే అనారోగ్యం కారణంగా 2007లో అర్ధంతరంగా వైదొలిగారు. ఆ తర్వాత 2012లో మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి ప్రధాని పదవిని అధిష్ఠించారు. ఈ విధంగా ఒక మాజీ ప్రధాని మళ్లీ ఆ పదవిని చేపట్టటం కూడా జపాన్‌లో రికార్డే. దూకుడైన నిర్ణయాలతో జపాన్‌ అభివృద్ధిని ఉత్తేజితం చేసిన ఆయన ఆర్థిక విధానాలు ‘అబేనామిక్స్‌'గా బాగా ప్రాచుర్యం పొందాయి. సంప్రదాయ, జాతీయవాదిగా షింజో అబేకు మంచి పేరుంది.


logo