గురువారం 01 అక్టోబర్ 2020
International - Sep 14, 2020 , 16:57:43

ఏమిటీ షెన్‌జెన్ సంస్థ‌.. ఎందుకీ డేటా మైనింగ్ ?

ఏమిటీ షెన్‌జెన్ సంస్థ‌.. ఎందుకీ డేటా మైనింగ్ ?

హైద‌రాబాద్‌:  భార‌తీయ వీఐపీల‌కు చెందిన డేటాను చైనా కంపెనీ జెన్‌హువా అక్ర‌మంగా వినియోగిస్తున్న‌ది.  డ్రాగ‌న్ దేశం హైబ్రిడ్ వార్‌కు దిగిన‌ట్లు భార‌త్ ఆరోపించింది.  ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా భార‌త ప్ర‌ముఖ‌ల స‌మాచారాన్ని చైనా కంపెనీ దుర్వినియోగం చేస్తున్న‌ది.  చైనాకు చెందిన షెన్‌జెన్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ సంస్థ‌.. ఓవ‌ర్‌షీస్ కీ ఇన్‌ఫ‌ర్మేష‌న్ డేటాబేస్‌(ఓకేఐడీబీ)ను అభివృద్ధి చేసింది. వాంగ్ జూఫెంగ్ ఈ కంపెనీ ఓన‌ర్‌. జెన్‌హువా డేటాలో ఈయ‌న‌కు 86 శాతం వాటా ఉన్న‌ది. గ‌తంలో ఐబీఎం ఇంజినీర్‌గా ప‌నిచేశాడు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, డేటా మైనింగ్‌లో నిపుణుడు. ఓవ‌ర్‌సీస్ సోష‌ల్ మీడియా డేటాలో ఈయ‌న‌కు ప‌దేళ్ల అనుభ‌వం ఉన్న‌ది. మ‌రో 12 టెక్ కంపెనీల‌తో వాంగ్‌కు అనుబంధం ఉన్న‌ది. ఆన్‌లైన్ ద్వారా షెన్‌జెన్ సంస్థ భార‌తీయ వీఐపీల‌ను నిఘా పెట్టింది.  ఆ స‌మాచారాన్ని చైనా ప్ర‌భుత్వానికి, క‌మ్యూనిస్టు పార్టీకి చేర‌వేస్తున్న‌ది. రెండున్న‌ర నెల‌ల ఇన్వెస్టిగేష‌న్ త‌ర్వాత ఆంగ్ల‌ప‌త్రిక ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ ఈ డేటాను సేక‌రించింది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా చైనా సంస్థ కేవ‌లం రెండు ఏళ్ల‌లో భార‌తీయ వీఐపీల స‌మాచారాన్ని క్రోడీక‌రించిన‌ట్లు గుర్తించారు. 

50 మందితో నిఘా?

షెన్‌జెన్ జెనుహువా కంపెనీని ఏప్రిల్ 2018 నుంచి ఆప‌రేట్ చేస్తున్నారు. చైనాలో ఈ కంపెనీలో 50 మంది ప‌నిచేస్తున్నారు. ఓవ‌ర్‌సీస్ డేటా ప్రాసెసింగ్ సెంట‌ర్లు 20 వ‌ర‌కు ఉన్న‌ట్లు గుర్తించారు. ప్ర‌తి రోజూ 150 మిలియ‌న్ల పీస్‌ల డేటాను హ్యాండిల్ చేస్తుంటారు. 5 బిలియ‌న్ల సోష‌ల్ మీడియా ఇన్‌పుట్ ద్వారా సుమారు 3 మిలియ‌న్ల సంస్థ‌ల‌పై జెన్‌హువా నిఘా పెడుతున్న‌ది. తైజీ కంప్యూట‌ర్స్‌, సేత్ బిగ్ డేటా అకాడ‌మీ, వెంజీ టెక్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ అండ్ ఎక‌నామిక్స్‌, చైనా హువ‌రాంగ్ టెక్నాల‌జీ గ్రూప్‌, ఎల్ఎస్ఎస్ఈసీ టెక్ సంస్థ‌లు.. షెన్‌జెన్ జెన్‌హువాకు అనుబంధంగా ప‌నిచేస్తున్నాయి. 

టార్గెట్‌లో 350 మంది ప్రస్తుత, మాజీ ఎంపీలు

భార‌త్‌కు చెందిన అయిదుగురు ప్ర‌ధాన‌మంత్రులు, రెండు డ‌జ‌న్ల ముఖ్య‌మంత్రులు, 350 మంది ఎంపీల‌ను చైనాకు చెందిన జెన్‌హువా సంస్థ ట్రాకింగ్ చేస్తున్న‌ట్లు ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ సంస్థ త‌న క‌థ‌నంలో రాసింది. సుమారు 1350 మంది భార‌తీయ‌ రాజ‌కీయ‌వేత్త‌ల స‌మాచారం ఆ సంస్థ ద‌గ్గ‌ర ఉన్న‌ది. 700 మంది రాజ‌కీయ‌వేత్త‌ల పేర్ల‌ను డైరక్ట్‌గా వాడింది. రాజ‌కీయ నాయ‌కుల‌కు ద‌గ్గ‌రగా ఉన్న 460 మంది వీఐపీల‌పై కూడా క‌న్నువేసింది.  సుమారు వంద మంది రాజ‌కీయ‌వేత్త‌ల కుటుంబ వృక్షాన్ని త‌యారు చేసిన‌ట్లు భావిస్తున్నారు.  350 మంది ప్ర‌స్తుత‌, మాజీ ఎంపీల‌ను టార్గెట్ చేశారు. హౌజ్ క‌మిటీ స‌భ్యుల‌పై నిఘా పెట్టారు. 40 మంది మాజీ, ప్ర‌స్తుత సీఎంల స‌మాచారం కూడా జెన్‌హువా వ‌ద్ద ఉన్న‌ట్లు గుర్తించారు. పెద్ద పెద్ద న‌గ‌రాల మేయ‌ర్లు, డిప్యూటీ మేయ‌ర్ల స‌మాచారం కూడా షెన్‌జెన్ వ‌ద్ద ఉన్న‌ది. గాంధీ, ప‌వార్‌, సింథియా, బాద‌ల్‌, సంగ్మా కుటుంబాల‌ను కూడా చైనా సంస్థ ఫాలోఅవుతున్న‌ది. బాలీవుడ్ నుంచి రాజ‌కీయాల్లోకి ఎంట‌ర్ అయిన హేమా మాలిని, అనుప‌మ్ ఖేర్‌తో పాటు ఇత‌ర న‌టుల‌పైన కూడా నిఘా పెట్టారు. 


logo