శుక్రవారం 29 మే 2020
International - May 11, 2020 , 13:15:55

ఆ బర్త్‌డే పార్టీలో కరోనా ఖళ్లుఖళ్లుమని దగ్గింది

ఆ బర్త్‌డే పార్టీలో కరోనా ఖళ్లుఖళ్లుమని దగ్గింది

హైదరాబాద్: కరోనా మహమ్మారి వ్యాప్తిలో అగ్రరాజ్యం అమెరికా అంగలువేస్తూ ముందుకు సాగుతున్నది. కరోనా పాజిటివ్‌ల సంఖ్య 13 లక్షలు దాటింది. కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ మరోవైపు అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఎత్తేస్తున్నారు. దీని ఫలితంగా మహమ్మారి మరింతగా ప్రజ్వరిల్లే అవకాశాలు ఉన్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరికలను నిజం చేసే సంఘటన ఒకటి కాలిపోర్నియా రాష్ట్రం పాసదెనాలో జరిగింది. ఒక్కసారిగా పెద్దఎత్తున కేసులు విస్తరించడానికి కారణమైన ఆ సంఘటనపై వాషింగ్టన్ పోస్టు పత్రిక వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటికే పరిమితం కావాలనే ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ ఇటీవల ఓ భారీ బర్త్‌డే పార్టీ జరిగింది.

బంధుమిత్రులు భారీసంఖ్యలో ఆ పార్టీకి హాజరయ్యారు. మాస్కులు ధరించడం, దూరం పాటించడం వంటి నిబంధనలు గాలికిపోయాయి. ఆ పార్టీలో అతిథిగా హాజరైన ఓ మహిళ మాస్కు లేకుండా ఖళ్లుఖళ్లున దగ్గుతూ అందరి మధ్య తిరిగింది. ఇది కరోనా దగ్గేమో అని తనమీద తాను జోకులేసుకుంది. మిగిలినవారు ముఖాలకు అడ్డు లేకుండా పార్టీ ఎంజాయ్ చేశారు. ఇప్పటివరకు ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. పార్టీకి హాజరైనవారిలో చాలామంది అస్వస్థులయ్యారని ఓ ప్రజారోగ్య విభాగం అధికారి తెలిపారు. 

ఎవరెవరు పార్టీకి హాజరయ్యారో అధికారులు వెతికే పనిలో పడ్డారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 65 వేలు దాటింది. 2,685 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. అయినా లాక్‌డౌన్ ఎత్తివేయాలని, నిబంధనలు తొలగించాలని వాదించేవారు వాదిస్తూనే ఉన్నారు. నిబందనలు అమలు చేసేవారిపై అక్కడక్కడా దాడులు కూడా జరుగుతున్నాయి.


logo