సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Jan 28, 2020 , 02:43:20

షార్జీల్‌ ఇమామ్‌పై బిగుస్తున్న ఉచ్చు

షార్జీల్‌ ఇమామ్‌పై బిగుస్తున్న ఉచ్చు
  • పలు రాష్ర్టాల్లో దేశద్రోహం కేసులు నమోదు
  • సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మార్కండేయ కట్జూ వ్యాఖ్య
  • షార్జీల్‌ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదు.. కానీ నేరం చేయలేదు
  • బీహార్‌లోని ఇమామ్‌ ఇంటిపై పోలీసుల దాడిజెహానాబాద్‌/ ఇంఫాల్‌/ ఇటానగర్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ షార్జీల్‌ ఇమామ్‌ అనే కార్యకర్తపై పోలీసుల ఉచ్చు బిగుస్తున్నది. అసోం, మణిపూర్‌, అరుణాచల్‌ ప్రదే శ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టాల్లో పోలీసులు షార్జిల్‌ ఇమామ్‌పై దేశద్రోహం కేసులు నమోదు చేశారు. దేశానికి వ్యతిరేకంగా విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారని అభియోగాలు నమోదు చేశారు. బీహార్‌లోని జెహానాబాద్‌ జిల్లా కాకో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఒక గ్రామంలోని ఆయన సొంతింటిపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. కానీ షార్జీల్‌ లేకపోవడంతో అతడి బంధువులు, డ్రైవర్‌లను అదుపులోకి తీసుకుని, తర్వాత విడిచి పెట్టారు.


ఐఐటీ-ముంబై కంప్యూటర్‌ సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ అయి న షార్జీల్‌.. ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌ వద్ద జరిగిన సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలో మాట్లాడుతూ ఒకవేళ ఆందోళనకు ఐదు లక్షల మందిని సమీకరించగలిగితే.. భారత్‌ నుంచి అసోంతోపాటు ఈశాన్య రాష్ర్టాలను శాశ్వతంగా, కనీసం నెలరోజులైనా విభజించవచ్చని, అప్పుడే తమ వాదన కేంద్రం వింటుందన్న వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచా రం అవుతున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ ఇటువంటి వ్యాఖ్యలతో మత సామరస్యానికి భంగం కలుగుతుందన్నారు. షార్జీల్‌ ఇమామ్‌ తల్లి అఫ్సాన్‌ రహీమ్‌ మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు అమాయకుడన్నారు. ఇదిలా ఉంటే, షార్జీల్‌ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని జస్టిస్‌ మార్కండేయ కట్జూ అన్నారు. కానీ అతడు ఎటువంటి నేరమూ చేయలేదన్నారు. అతడి ప్రసంగాన్ని తాను చూడలేదని, అతడిపై నమోదు చేసిన కేసును రాజ్యాంగంలోని 226 అధికరణం, సీఆర్పీసీలోని 482 సెక్షన్‌ ప్రకారం ఏదైనా హైకోర్టు కొట్టివేసే అవకాశం ఉందని చెప్పారు. logo