సోమవారం 30 నవంబర్ 2020
International - Nov 14, 2020 , 15:19:08

పాకిస్థాన్‌లో మహిళలకు రక్షణ లేదు: మరియం షరీఫ్‌

పాకిస్థాన్‌లో మహిళలకు రక్షణ లేదు: మరియం షరీఫ్‌

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం షరీఫ్‌.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. జైలులో ఉన్న సమయంలో తన బ్యారక్ బాత్రూంలో కెమెరాలను ఏర్పాటు చేశారని చెప్పారు. మాజీ ప్రధాని కుమార్తెనే సురక్షితంగా లేకపోతే ఇక పాకిస్తాన్‌లోని సాధారణ మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇటీవల మరియంతోపాటు ఆమె భర్త కెప్టెన్‌ సఫ్దర్‌ను అక్టోబర్‌ 19 న సైన్యం, ఐఎస్‌ఐ అధికారులు బలవంతంగా అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. శుక్రవారం విడుదలైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారుజ జైలులో తనను అక్కడి అధికారులు తీవ్రంగా వేధించారని, తానుంటున్న బ్యారక్‌ బాత్రూంలో కెమెరాలు పెట్టారని ఆరోపించారు. ఇది స్త్రీలను అవమానించడమే అన్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) ఉపాధ్యక్షురాలు, ఎంపీ కూడా అయిన తన పట్ల ఇంత దురుసుగా ప్రవర్తించడం సహించరానిదన్నారు. 

పాకిస్తాన్ రాజకీయాలు, ప్రభుత్వానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై మరియం మాట్లాడారు. 'ఇటీవల ప్రభుత్వం నన్ను రెండుసార్లు జైలుకు పంపింది. నేను అక్కడి పరిస్థితి గురించి మాట్లాడితే వింతగా అనిపిస్తుంది. స్త్రీల పట్ల ఇలాగానే ప్రవర్తించడం? నేను నిజం చెబితే.. ప్రభుత్వం, పరిపాలనాధికారులు వారి ముఖం కూడా చూపించలేరు. ఇమ్రాన్ ఖాన్‌ నేతృత్వంలోని ప్రభుత్వంలో పాకిస్తాన్ మహిళలకు రక్షణ లేదని తెలుస్తున్నది. ఇక్కడి మహిళలు బలహీనంగా లేరని ఇమ్రాన్‌ఖాన్‌ గుర్తుంచుకోవాలి' అని చెప్పారు. పాకిస్తాన్‌లో మాజీ ప్రధాని కుమార్తె, ఎంపీ సురక్షితంగా లేకుంటే.. సాధారణ మహిళ ఎలా సురక్షితంగా ఉంటారు అని మరియం షరీఫ్‌ ప్రశ్నించారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.