శుక్రవారం 05 జూన్ 2020
International - May 06, 2020 , 20:01:07

క‌ల‌వ‌ర‌పెడుతున్న క‌రోనా జ‌న్యు ప‌రివ‌ర్త‌న !

క‌ల‌వ‌ర‌పెడుతున్న క‌రోనా జ‌న్యు ప‌రివ‌ర్త‌న !

హైద‌రాబాద్‌: జ‌న్యువులు ప‌రివ‌ర్త‌న చెంద‌డం స‌హ‌జం. కాని నోవెల్ క‌రోనా వైర‌స్ ప‌రివ‌ర్త‌న చెందుతున్న తీరు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.  కోవిడ్‌19 వ్యాధికి కార‌ణ‌మైన‌ క‌రోనా వైర‌స్‌లో ముటేష‌న్స్ వంద‌ల సంఖ్య‌లో జ‌రుగుతున్నట్లు అమెరికా, బ్రిట‌న్ శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. ఒక‌వేళ వైర‌స్ హెచ్చు రీతిలో పరివ‌ర్త‌న చెందితే అప్పుడు వ్యాక్సిన్ ప్ర‌భావం ఎలా ఉంటుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొన్న‌ది.  సాధార‌ణంగా వైర‌స్‌ల‌లో జ‌న్యువులు ప‌రివ‌ర్త‌న చెందుతూనే ఉంటాయి. అది వాటి స‌హ‌జ ల‌క్ష‌ణం. కానీ ఒక‌వేళ ఇదే త‌ర‌హాలో జ‌న్యు ప‌రివ‌ర్త‌న జ‌రిగితే, అప్పుడు వ్యాధి తీవ్ర‌త ఎలా ఉంటుందో కూడా ప‌సిక‌ట్ట‌డం క‌ష్ట‌మే అవుతుంది. 

అమెరికాలో నిర్వ‌హించిన ప్రాథ‌మిక ప‌రిశోధ‌న‌లో.. డీ614జీ జీన్ ముటేష‌న్.. డామినెంట్‌గా మారుతున్న‌ట్లు శాస్త్ర‌వేత్తలు గుర్తించారు. అంతేకాదు, ఆ జ‌న్యుక్ర‌మం వ్యాధిని మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారుస్తున్న‌ట్లు గ‌మ‌నించారు. అయితే ఆ నివేదిక‌ను ఇత‌ర శాస్త్ర‌వేత్త‌లు ఇప్ప‌టి వ‌ర‌కు స‌మీక్షించ‌లేదు. ఈ విష‌యాన్ని వాళ్లు ఎటువంటి జ‌ర్న‌ల్‌లో కూడా ప‌బ్లిష్ చేయ‌లేదు.  

న్యూమెక్సికోలో ఉన్న లాస్ అలామోస్ నేష‌న‌ల్ ల్యాబ‌రేట‌రీలో ఉన్న ప‌రిశోధ‌కులు.. క‌రోనా వైర‌స్ ప్రోటీన్‌లో ఉన్న స్పైక్‌ల‌ను స్ట‌డీ చేస్తున్నారు.  గ్లోబ‌ల్ ఇనిషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్‌ప్లూయాంజా డేటా ఆధారంగా ప్రోటీన్ స్పైక్ అధ్య‌య‌నం చేప‌డుతున్నారు. చాలా శ‌ర‌వేగంగా జ‌న్యు ప‌రివ‌ర్త‌న జ‌రుగుతున్న‌ట్లు ఆ శాస్త్ర‌వేత్తలు గ‌మ‌నించారు. కానీ దాని ప‌ర్య‌వ‌సానాలు ఎలా ఉంటాయ‌న్న విష‌యాన్ని వాళ్లు ఇంకా నిర్ధారించ‌లేదు. 

బ్రిట‌న్‌లోని శాస్త్ర‌వేత్త‌లు కూడా షీఫీల్డ్‌లో ఉన్న క‌రోనా వైర‌స్ పేషెంట్ల‌ను అధ్య‌య‌నం చేశారు. కొన్ని  వైర‌స్ శ్యాంపిల్స్‌లో జ‌న్యు ముటేష‌న్ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు గుర్తించారు. అయితే అలాంటి పేషెంట్ల హాస్పిట‌ల్లో ఎక్కువ కాలం ఉన్నారా లేక వాళ్లు మ‌రింత బ‌ల‌హీన‌ప‌డ్డారా అన్న విష‌యాన్ని గుర్తించ‌లేదు. 

యూనివ‌ర్సిటీ కాలేజ్ లండ‌న్‌లో కూడా వైర‌స్ జ‌న్యుక్ర‌మంపై స్ట‌డీ చేశారు.  వైర‌స్‌కు 198 జ‌న్యు ప‌రివ‌ర్తన‌లు జ‌రిగిన‌ట్లు గుర్తించారు. వైర‌స్‌లో జ‌న్యు ముటేష‌న్ జ‌ర‌గ‌డం త‌ప్పేమీ కాదు అని, కానీ సార్స్ సీవోవీ2 వైర‌స్ మాత్రం చాలా వేగంగా ప‌రివ‌ర్త‌న చెందుతున్న‌ద‌ని ప్రొఫ‌స‌ర్ ఫ్రాంకోయిస్ బ‌ల్లాక్స్ తెలిపారు. అనుకున్న‌దాని క‌న్నా నెమ్మ‌దిగా కూడా వైర‌స్ ప‌రివ‌ర్త‌న జ‌ర‌గ‌డం లేద‌న్నారు. సార్స్ సీవోవీ2 ప‌రివ‌ర్త‌న‌ల‌తో ప్ర‌మాద‌క‌రంగా మారుతుందా లేదా అన్న విష‌యాన్ని కూడా నిర్ధారించ‌లేక‌పోతున్న‌ట్లు చెప్పారు. 

యునివ‌ర్సిటీ ఆఫ్ గ్లాస్‌గో కూడా వైర‌స్ జ‌న్యువుల‌ను స్ట‌డీ చేసింది. జ‌న్యువుల్లో మార్పు జ‌రుగుతున్నా.. ఇక్క‌డ స‌ర్క్యులేట్ అవుతున్న వైర‌స్ ఒక్క‌టే అని ఆ అధ్య‌య‌నం తేల్చింది. వైర‌స్ రూపంలో ఉన్న స్వ‌ల్ప తేడాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మానిట‌ర్ చేసి.. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయాల‌న్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫ్లూ వైర‌స్ కూడా ప్ర‌తి ఏడాది వేగంగా ముటేష‌న్ చెందుతున్న‌ద‌ని, కానీ దానికి త‌గిట‌న్లు ప్ర‌తి ఏడాది వ్యాక్సిన్‌ను కూడా త‌యారు చేస్తున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. 

ప్ర‌స్తుతం కోవిడ్‌19 వ్యాక్సిన్ త‌యారీ చేస్తున్న సంస్థ‌ల‌న్నీ.. ఆ వైర‌స్‌లో ఉన్న ప్రోటీన్ల‌నే టార్గెట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ ప్రోటీన్ స్పైక్‌లు నిత్యం మారుతూఉంటే, అప్పుడు వ్యాక్సిన్ డెవ‌ల‌ప్ చేసినా ఫ‌లితం ఉండ‌క‌పోవ‌చ్చు అన్న అనుమానాలు వ‌స్తున్నాయి. వైర‌స్‌లో జ‌న్యువులు ప‌రివ‌ర్త‌న చెందుతుంటే .. దానికి ఏం చేయాల‌న్న విష‌యంలో శాస్త్ర‌వేత్త‌ల వ‌ద్ద కూడా స‌మాచారం లేదు. వీలైన‌న్ని వైర‌స్ జన్య‌వుల‌ను స్ట‌డీ చేస్తేనే దానికి త‌గిన ఔష‌ధాన్ని త‌యారు చేయ‌వ‌చ్చు అని యూసీఎల్‌లో చేసే డాక్ట‌ర్ లూసీ వాన్ డార్ప్ తెలిపారు.
logo