గురువారం 02 ఏప్రిల్ 2020
International - Jan 23, 2020 , 01:07:24

చంద్రుడి ధూళి నుంచి ఆక్సిజన్‌!

చంద్రుడి ధూళి నుంచి ఆక్సిజన్‌!
  • వ్యోమగాముల కోసం ఈఎస్‌ఏ పరిశోధన

లండన్‌: చంద్రుడిపై ఉండే దుమ్ము, ధూళి (మూన్‌డస్ట్‌) నుంచి ఆక్సిజన్‌ను రూపొందించే సరికొత్త వ్యవస్థను యూరోపియన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఈఎస్‌ఏ) అభివృద్ధి చేస్తున్నది. చంద్రుడిపై వ్యోమగాములు శ్వాస తీసుకునేందుకు దోహదపడడంతోపాటు రాకెట్‌ ఇంధన ఉత్పత్తికి కూడా ఇది ఉపయోగపడుతుందని ఈఎస్‌ఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. చంద్రుడి ఉపరితలం నుంచి సేకరించిన నమూనాలను బట్టి చంద్రుడి ఉపరితల పొరల్లో 40-45 శాతం ఆక్సిజన్‌ ఉన్నట్లు తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇది మినరల్స్‌, గ్లాస్‌ రూపంలో ఆక్సైడ్స్‌ మాదిరిగా ఉండడంతో తక్షణ వినియోగానికి వీలుపడదని వివరించారు. ‘మోల్టెన్‌ సాల్ట్‌ ఎలక్ట్రోలసిస్‌' అనే పద్ధతి ద్వారా ఆక్సిజన్‌ను వేరుచేయచ్చని తెలిపారు. దీని ద్వారా ఇతర లోహసమ్మేళనాలు కూడా ఉత్పత్తి అవుతాయని, ఇది మరో ప్రయోజనమని చెప్పారు. చంద్రుడిపై ‘పైలట్‌ ప్లాంట్‌'ను రూపొందించడమే తమ లక్ష్యమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 


logo