శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 16, 2020 , 02:02:50

ఏబ్సెలిన్‌తో కరోనా కట్టడి!

ఏబ్సెలిన్‌తో కరోనా కట్టడి!

  • మానసిక వ్యాధుల ఔషధంతో వైరస్‌ను  అడ్డుకోవచ్చని భావిస్తున్న శాస్త్రవేత్తలు 
  • ఔషధం వాడకంతో దుష్ప్రభావాలు కూడా లేనట్టు వెల్లడి

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పట్టనున్న నేపథ్యంలో అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనల పంథాను మార్చారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఔషధాలు ఏమైనా వైరస్‌ను కట్టడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయా అన్న దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వినికిడి సమస్యలు, మానసిక ఒత్తిళ్లను దూరంచేసే ‘ఏబ్సెలిన్‌' ఔషధం కొవిడ్‌-19 కట్టడికి సాయపడుతున్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కరోనా అణువుల్లోని ప్రొటీస్‌, ఎం-ప్రో వంటి ఎంజైమ్‌లు వైరస్‌ అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తున్నాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఎంజైమ్‌ల వృద్ధిని కట్టడి చేయడంలో ‘ఏబ్సెలిన్‌' ఔషధం మెరుగ్గా పనిచేస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని వెల్లడించారు. కంప్యూటర్‌ సిమ్యులేషన్స్‌ సాంకేతికత సాయంతో దీన్ని కనుగొన్నామన్నారు. అయితే, దీనిపై మరిన్ని పరిశోధనలు నిర్వహించాల్సి ఉన్నదని వివరించారు. ఈ వివరాలు ‘సైన్స్‌ అడ్వాన్సెస్‌' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ‘వైరస్‌ అణువుల్లోని ఎం-ప్రో వంటి ఎంజైమ్‌ల వృద్ధిని ఏబ్సెలిన్‌ రెండు విధాలుగా నిరోధిస్తున్నట్టు గుర్తించాం. మొదటిది.. ఎంజైమ్‌లోని క్యాటలిటిక్‌ ప్రాంతాన్ని విస్తరించకుండా కట్టడి చేయడం, రెండోది.. మరో అణువులో ఎంజైమ్‌లు వృద్ధి చెందకుండా నిరోధించడం’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జువాన్‌ ది పాబ్లో తెలిపారు. మనుషులపై ఏబ్సెలిన్‌ ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించబోదని ఇదివరకే రుజువైనట్టు శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా తెలిపారు.


logo