శనివారం 04 ఏప్రిల్ 2020
International - Jan 25, 2020 , 03:14:06

వినాశానికి ‘100 సెకండ్లు’!

వినాశానికి ‘100 సెకండ్లు’!

ప్రపంచ వినాశనానికి రోజులు దగ్గరపడ్డాయా? మరికొద్ది రోజుల్లో అణ్వాయుధ దేశాల మధ్య భీకర యుద్ధం జరిగి భూగ్రహం నాశనం కానున్నదా? జరుగుతున్న పరిణామాలను చూస్తే అలాగే అనిపిస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అణ్వాయుధ ముప్పును గురించి హెచ్చరించేందుకు వాడుతున్న డూవ్‌ డే గడియారంలో ముల్లు స్థానం తాజాగా మారింది. డూవ్‌ గడియారంలోని నిమిషాల ముల్లును 20 సెకండ్ల ముందుకు శాస్త్రవేత్తలు జరిపారు. దీన్నిబట్టి ప్రపంచ వినాశం అత్యంత దగ్గర్లోనే ఉన్నదని శాస్త్రవేత్తలు చెప్పకనే చెప్పారు.

  • దక్షిణాసియాలో ఉద్రిక్తతలు.. ట్రంప్‌ ఏకపక్ష నిర్ణయాలు
  • అమెరికా-రష్యా మధ్య దిగజారిన సంబంధాలు.. ఉత్తరకొరియా దూకుడు
  • ఈ నేపథ్యంలోనే డూవ్‌ ముల్లు ముందుకు జరిగిందన్న బీఏఎస్‌
  • 20 సెకండ్లు ముందుకు జరిగిన డూవ్‌ డే గడియారం ముల్లు

న్యూయార్క్‌: ప్రచ్ఛన్న యుద్ధం నాటి రోజుల కంటే ప్రస్తుత ప్రపంచం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నదని, అణ్వాయుధాల మార్పిడితో గతంలో ఊహించనంతటి ఎక్కువ ప్రమాదంలోకి ప్రపంచం క్రమంగా వెళ్తున్నదని పేర్కొంటూ ‘బులెటిన్‌ ఆఫ్‌ ది అటామిక్‌ సైంటిస్ట్స్‌(బీఏఎస్‌)’ సంస్థ శాస్త్రవేత్తలు డూవ్‌ డే గడియారాన్ని గురువారం 20 సెకండ్ల ముందుకు జరిపారు. దీంతో వినాశనాన్ని(డూమ్స్‌ డే) సూచించే అర్ధరాత్రికి కేవలం 100 సెకండ్ల దూరంలో గడియారం ముల్లు నిలిచినట్లయింది. ప్రపంచ వినాశనానికి రెండు నిమిషాల(120 సెకండ్లు) దూరంలో ప్రస్తుతం ఉన్నామనే దానికి గుర్తుగా డూవ్‌ గడియారాన్ని ఇప్పటి వరకూ నిర్వహిస్తున్నారు. అయితే, తాజామార్పుతో ముల్లు స్థానం 12 గంటలకు 100 సెకండ్ల దూరంలో ఉన్నది.


ప్రపంచ అస్తిత్వానికే ముప్పు 

బీఏఎస్‌ లాభాపేక్షలేని సంస్థ. ప్రపంచ దేశాల భద్రతా అంశాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తున్నది. తాజాగా డూవ్‌ డే గడియారం సమయాన్ని మార్చిన సందర్భంగా బీఏఎస్‌ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ‘73 ఏండ్ల చరిత్రలో ఇంత దగ్గరగా వినాశనం ఎప్పటికీ రాలేదు’ అని పేర్కొన్నారు. దక్షిణాసియా అత్యంత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని, అక్కడి దేశాల మధ్య సంప్రదింపులు, ఒడంబడికలు, మధ్యవర్తిత్వం నిర్వహించే అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయని.. భారత్‌, పాక్‌ పేర్లను ప్రస్తావించకుండానే నిపుణులు హెచ్చరించారు. ‘డూవ్‌ డే గడియారం ముల్లు ఇరవై సెకండ్లు ముందుకు జరిగిందంటే, ప్రపంచం ఊహించనంతటి ఎక్కువ ప్రమాదంలోకి వెళ్తున్నది. ప్రపంచదేశాల అస్తిత్వానికి విపత్తు పరిణమించనున్నది. ప్రచ్ఛన్న యుద్ధం పరిస్థితులతో పోలిస్తే ముల్లు డూవ్‌ డేకు మరింత చేరువైంది. గత కొన్నేండ్లుగా ఇది కొనసాగుతున్నది’ అని బీఏఎస్‌ శాస్త్రవేత్తలు తెలిపారు.  


ఎప్పుడు ఏర్పాటు చేశారు? 

యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో శాస్త్రవేత్తలు బీఏఎస్‌ను 1945లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రెండేండ్లకు డూవ్‌ డే గడియారాన్ని ప్రారంభించారు. డూవ్‌ డే గడియారంలో 12 గంటల సమయానికి ముల్లు చేరినట్లయితే ప్రపంచ వినాశనంగా పరిగణిస్తారు. బోర్డు స్పాన్సర్లు, 13మంది నోబెల్‌ గ్రహీతలను సంప్రదించి బీఏఎస్‌ సైన్స్‌, భద్రతా బోర్డు నిపుణులు ఏటా డూవ్‌ డే గడియారంలోని ముల్లును జరుపాలా?, లేక అలాగే ఉంచాలా? అన్నదానిపై నిర్ణయం తీసుకుంటారు. 


అమెరికా వైఖరే కారణం 

అమెరికా, రష్యా మధ్య గతంలో జరిగిన ఒప్పందాలు రద్దయ్యాయి. ఆ దేశాల మధ్య నెలకొన్న అణ్వాయుధాల పోటీ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఫలప్రదం అయ్యే  అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అణ్వాయుధాలకు సంబంధించి అమెరికా- అప్పటి సోవియెట్‌ యూనియన్‌ మధ్య జరిగిన ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం ఇప్పటికే రద్దయ్యాయి. అణ్వాయుధాల సామర్థ్యాన్ని తగ్గించే ఉద్దేశంతో తీసుకొచ్చిన ‘న్యూస్టార్ట్‌' ఒప్పందానికి కూడా మరికొన్ని సంవత్సరాల్లో గడువు తీరిపోనున్నది. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం అణ్వాయుధాల్లో 90 శాతం ఆయుధాల్ని ఆ రెండు దేశాలే  (అమెరికా-రష్యా) కలిగి ఉన్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాలన నేపథ్యంలో డూవ్‌ డే గడియారంలో ముల్లు మిడ్‌నైట్‌కు క్రమంగా దగ్గరవుతున్నది. వాతావరణ మార్పులు, అణ్వాయుధాల అంశంలో 


చరిత్రలో డూవ్‌ డే ముల్లు జరిగిన స్థానాలు.. 


1947డూవ్‌ డే గడియారం ప్రారంభించిన రోజు.. మిడ్‌నైట్‌కు  7 నిమిషాల దూరంలో ముల్లును ఉంచారు. 

1953అమెరికా, అప్పటి సోవియెట్‌ రష్యా హైడ్రోజన్‌ బాంబును   పరిక్షించిప్పుడు తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల్లో 2 నిమిషాల దూరంలో ముల్లును ఉంచారు.

1968ఫ్రాన్స్‌, చైనా అణ్వాయుధాలను పరీక్షించినప్పుడు.. 7 నిమిషాల దూరంలో ముల్లును ఉంచారు.  

1991ప్రచ్ఛన్న యుద్ధం ముగింపు సమయంలో.. 17 నిమిషాల దూరంలో ముల్లును ఉంచారు.

1998భారత్‌-పాక్‌ అణ్వాయుధాలను పరీక్షించినప్పుడు..9 నిమిషాల దూరంలో ముల్లును ఉంచారు.


logo