బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 10, 2020 , 18:10:37

ఎట్టకేలకు తెరుచుకున్న పాఠశాలలు!

ఎట్టకేలకు తెరుచుకున్న పాఠశాలలు!

కొలంబో : కరోనా వైరస్‌ కారణంగా సుమారు 6 నెలల నుంచి మూతబడిన పాఠశాలలు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. సోమవారం నుంచి శ్రీలంకలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. కఠినమైన ఆరోగ్య మార్గదర్శకాల మధ్య అన్ని తరగతుల వారికి పాఠశాలలను తిరిగి ప్రారంభించారు. విద్యార్థులు ఖచ్చితంగా ముఖానికి మాస్కు ధరించి, క్రమం తప్పకుండా చేతులు శుభ్ర పర్చుకోవడం, భౌతికదూరం వంటి కనీస నిబంధనలు పాటించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని తెలిసింది. 

తరగతి గదుల్లోని డెస్కులను కూడా ఒక మీటర్ దూరంలో ఉంచారు. విద్యార్థులు ఆట స్థలాలకు వెళ్లడం, క్రీడల్లో పాల్గొనడం వంటివి నిషేధం. 200 మందికి పైగా విద్యార్థులున్న పాఠశాలలు కఠినమైన భౌతిక దూరాన్ని పాటించాలని, ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఒకే చోట గుంపులుగా ఉండకుండా నిరోధించడానికి ప్రత్యేక రోజుల్లో కూడా తరగతులను నిర్వహించాలని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖ అధికారులు ధృవీకరించే వరకు పాఠశాల క్యాంటీన్లు కూడా తెరువబోమని స్పష్టం చేశారు. 

శ్రీలంకలో మొదటి కరోనా కేసు నమోదు కాగానే మార్చి నెలలో పాఠశాలలు మూతబడ్డాయి. జూలైలో కొన్ని తరగతుల కోసం పాఠశాలలు తెరిచినా కరోనా కేసుల ఉధృతి కారణంగా తిరిగి మూసివేశారు. ఇటీవల కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేనందున సోమవారం నుంచి పాఠశాలలను తిరిగి తెరవాలని నిర్ణయించుకున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్రీలంకలో ఇప్పటివరకు 2,844 కరోనా కేసులు నమోదయ్యాయి. 2,593 మంది కరోనా బారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు కేవలం 11 మంది మాత్రమే కరోనాతో మరణించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo