గురువారం 26 నవంబర్ 2020
International - Oct 31, 2020 , 17:25:45

మక్కాలోకి కారుతో దూసుకెళ్లేందుకు వ్యక్తి ప్రయత్నం

మక్కాలోకి కారుతో దూసుకెళ్లేందుకు వ్యక్తి ప్రయత్నం

రియాద్: ఇస్లాం పవిత్ర స్థలమైన మక్కా మసీదులోకి ఓ వ్యక్తి కారుతో దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. మసీదు వద్ద భద్రతగా ఉన్న గార్డులు అతడ్ని వెంబడించి పట్టుకున్నారు. సదరు వ్యక్తి మతిస్థిమితం సరిగా లేదని తెలుస్తున్నది. ఈ విషయాన్ని సౌదీ అరేబియా అధికారులు శనివారం ధ్రువీకరించారు. శుక్రవారం మధ్యాహ్నం మసీదు దక్షిణ ద్వారాలలో ఒకదానిని ఢీకొట్టి లోనికి కారుతోపాటు వెళ్లేందుకు ఓ వ్యక్తి విఫలయత్నం చేశాడు. బయట ఉన్న రెండు బారికేడ్లను అధిగమించగా.. అక్కడే ఉన్న గార్డ్లులు అతడిని వెంబడించి నిలువరించినట్లు సమాచారం. కారుతో మక్కాలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిపేరుగానీ, ఆయన ఎక్కడి వాడనిగానీ సౌదీ అధికారులు వెల్లడించలేదు. అయితే, అసాధారణ స్థితిలో ఉన్నాడని మాత్రం తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయానికి పంపించామని వారు చెప్పారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మూతపడిన పవిత్ర మక్కా మసీదు.. ఏడు నెలల అనంతరం ఈ నెలలో తెరుచుకున్నది. కరోనా వైరస్ అడ్డంకులను సడలించడంతో 15 వేల మంది ఆరాధకులకు రాజ్యం లోపల వసతి కల్పించడానికి ఉమ్రా తీర్థయాత్రను విస్తరించారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉమ్రా తీర్థయాత్ర మార్చిలో నిలిపివేశారు. ఉమ్రాపై పరిమితిని ఆదివారం నుంచి 20 వేలకు పెంచనున్నారు. విదేశాల నుంచి కూడా యాత్రికులను అధికారులు అనుమతిస్తారు. చరిత్రలో తొలిసారిగా అతి తక్కువ మందితో హాజ్‌ తీర్థయాత్రను సౌదీ అరేబియా నిర్వహించింది. గత ఏడాది దాదాపు 2.5 లక్షల మంది యాత్రికులు మక్కాను దర్శించుకోగా.. ఈసారి కేవలం 10 వేల మంది దేశ పౌరులు మాత్రమే పాల్గొనేందుకు అనుమతించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.