శనివారం 04 ఏప్రిల్ 2020
International - Mar 08, 2020 , 02:49:20

శత్రుశేషం లేకుండా.. అరెస్టులు!

శత్రుశేషం లేకుండా.. అరెస్టులు!
  • సౌదీలో ముగ్గురు యువరాజులు అరెస్ట్‌
  • రాజద్రోహం అభియోగాలు నమోదు
  • యావజ్జీవం లేదా మరణశిక్ష విధించే అవకాశం

రియాద్‌, మార్చి 7: సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ తనకు శత్రుశేషం లేకుండా చేసుకుంటున్నారు. రాజద్రోహం అభియోగాలపై సౌదీ రాజకుటుంబానికి చెందిన ముగ్గురు యువరాజులను శుక్రవారం అరెస్ట్‌ చేయించారు. రాజు సల్మాన్‌ సోదరుడు అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌, ఆయన కుమారులు మొహమ్మద్‌ బిన్‌ నయీఫ్‌, నవాఫ్‌ బిన్‌ నయీఫ్‌లను శుక్రవారం వేకువజామున వారి నివాసాల నుంచి రాయల్‌గార్డ్స్‌ తీసుకెళ్లినట్లు అమెరికా మీడియా సంస్థలు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌, న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించాయి. రాజు సల్మాన్‌, యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌లను అస్థిరపరిచేందుకు కుట్రపన్నినట్లు రాయల్‌ కోర్టు వీరిపై అభియోగాలను నమోదుచేసింది.


వీరికి యావజ్జీవ శిక్ష లేదా మరణ దండన విధించే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. రాజు సల్మాన్‌ నుంచి అధికారికంగా బాధ్యతలు స్వీకరించే ముందు తనకు ఎదురు లేకుండా చూసుకునేందుకే యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఈ అరెస్టులు చేయించినట్లు విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. తనపై అసమ్మతి వ్యక్తంచేసిన ప్రముఖ మతగురువులు, కార్యకర్తలు, యువరాజులు, వ్యాపారవేత్తలను ఆయన ఇదివరకే అరెస్ట్‌ చేయించారు. 2018 అక్టోబర్‌లో టర్కీలోని సౌదీ రాయబార కార్యాలయంలో జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ హత్యకు గురికావడంపై యువరాజు మీద అంతర్జాతీయంగా తీవ్ర ఆరోపణలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వంలోని కీలక విభాగాలన్నింటిపైనా పట్టు సాధించిన యువరాజు.. డీఫ్యాక్టో రూలర్‌గా మారారు. తాజా అరెస్టులపై సౌదీ అధికారులు స్పందించలేదు. 


logo