శుక్రవారం 22 జనవరి 2021
International - Dec 21, 2020 , 12:32:42

అంతర్జాతీయ సరిహద్దులు మూసివేసిన సౌదీ

అంతర్జాతీయ సరిహద్దులు మూసివేసిన సౌదీ

రియాద్‌ : యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో కొత్త కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ను కొనుగొన్న నేపథ్యంలో సౌదీ అరేబియా సరిహద్దులను మూసివేయడంతో పాటు అంతర్జాతీ విమానాలపై వారం రోజుల పాటు బ్యాన్‌ విధించింది. ఇప్పటికే యూరోపియన్‌ యూనియన్‌ దేశాల నుంచి సౌదీ అరేబియాకు చేరిన ప్రజలందరితో పాటు, కొత్త కరోనా వైరస్‌ వెలుగు చూసిన రాష్ట్రాల నుంచి వచ్చిన వారంతా రెండు వారాల పాటు ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించింది. గత మూడు నెలల్లో యూరోపియన్‌ దేశాలను సందర్శించిన వారు కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని మంత్రిత్వశాఖ పేర్కొన్నట్లు అధికారిక సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ పేర్కొంది. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, ఐర్లాండ్, కెనడా, బల్గేరియాతో పాటు పలు దేశాలు ఇప్పటికే యూకే ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.

అలాగే యూకే, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, దక్షిణాఫ్రికా నుంచి విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టర్కీ అధికారులు పేర్కొన్నారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు రవాణా, మౌలిక సదుపాయాల కల్పన మంత్రిత్వశాఖ సమన్వయంతో ఇంగ్లాండ్‌, డెన్మార్క్‌, నెదర్లాండ్‌, దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలపై తాత్కాలిక సస్పెన్షన్‌ విధించినట్లు టర్కీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహ్రెటిన్‌ కోకా ట్విట్టర్‌లో తెలిపారు. కొత్త నిషేధాజ్ఞల మధ్య టర్కీ పౌరులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌ నుంచి వచ్చే ప్రయాణికులందరినీ పరీక్షిస్తామని, ఇప్పటికే మార్గమధ్యలో ఉన్న వారికి నిర్బంధ నియమాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

మొరాకో సైతం యూకేకు విమానా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నిషేధం ఎన్ని రోజులు కొనసాగుతుందో మాత్రం చెప్పలేదు. ఇదిలా ఉండగా.. ఇతర సార్స్‌ కోవ్‌-2 వైరస్‌ జాతుల కంటే 70శాతం కంటే ఎక్కువ వ్యాప్తి చెందే కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ స్ట్రెయిన్‌ను గుర్తించినట్లు యూకే అధికారులు శనివారం ప్రకటించారు. కొత్త కేసులు సగానికిపైగా కొత్త వైరస్‌ కారణంగానేని భావించి యూకే ప్రభుత్వం లండన్‌ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించింది. క్రిస్మస్‌కు ముందు సడలింపులు ఇస్తామని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించిన.. కొత్త వేరియంట్‌తో ఆదివారం లాక్‌డౌన్‌ విధించింది. అలాగే నెదర్లాండ్స్‌, డెన్మార్క్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలో సైతం కరోనా కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ను గుర్తించారు. 



logo