మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Sep 05, 2020 , 04:12:25

రష్యా టీకా సేఫే!

రష్యా టీకా సేఫే!

మాస్కో, సెప్టెంబర్‌ 4: కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు రష్యా అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్‌ వీ’ టీకాపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. ప్రముఖ వైద్య జర్నల్‌ ‘లాన్సెట్‌' ఆ టీకా సురక్షితమేనంటూ తేల్చిచెప్పింది. ప్రాథమిక ఫలితాల ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించామని లాన్సెట్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. తొలి రెండు దశల హ్యూమన్‌ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు వెల్లడైనట్లు తెలిపింది. వ్యాక్సిన్‌ ఇచ్చిన అందరిలోనూ కరోనాను అడ్డుకునే యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని, అలాగే తీవ్ర ప్రతికూల ప్రభావాలేమీ వారిలో కనిపించలేదని వివరించింది. ఈ మేరకు 76 మందిపై ఈ టీకాను పరీక్షించి ఆ ఫలితాలను లాన్సెట్‌లో ప్రచురించారు. అందరిలోనూ 21 రోజుల్లో యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు, 28 రోజుల్లో టీ సెల్స్‌ ఉత్పత్తి అయినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది.

రెండు ఫార్ములేషన్స్‌..

అధ్యయనంలో భాగంగా వ్యాక్సిన్‌కు సంబంధించి రెండు రకాల ఫార్ములేషన్స్‌ను పరీక్షించారు. ఒకటి ఫ్రోజెన్‌ (ఘనీభవన) కాగా, రెండోది లియోఫిలైజ్‌ (ఫ్రీజ్‌-డ్రై) ఫార్ములేషన్‌. ప్రపంచవ్యాప్తంగా విస్తృత పంపిణీకి ఫ్రోజెన్‌ ఫార్ములేషన్‌ వినియోగిస్తారు. మారుమూల ప్రాంతాలకు తరలించడానికి ఫ్రీజ్‌-డ్రై వ్యాక్సిన్లను వాడుతారు. వీటిని 2-8 డిగ్రీల సెంటీగ్రేడ్‌ల వద్ద కూడా నిల్వ చేయవచ్చు. ఈ వ్యాక్సిన్‌లో టైప్‌ 26 (ఆర్‌ఏడీ26-ఎస్‌), టైప్‌ 5 (ఆర్‌ఏడీ5-ఎస్‌) రికాంబినెంట్‌ హ్యూమన్‌ అడినోవైరస్‌లను వినియోగించారు. వీటికి జన్యుమార్పులు చేసి సార్స్‌-కోవ్‌-2లో ఉండే స్పైక్‌ ప్రొటీన్‌ను అభివృద్ధి చేశారు. ఈ అడినోవైరస్‌లను బలహీనపరచడం వల్ల ఇవి శరీరంలోకి వెళ్లాక నకళ్లను సృష్టించవు. తద్వారా వ్యాధిని కలుగజేయవు.

రెండు రకాల అడినోవైరస్‌ల వినియోగం..

‘అడినోవైరస్‌ వ్యాక్సిన్లు మనిషి కణాల్లోకి చేరినప్పుడు, అవి సార్స్‌ కోవ్‌ 2 స్పైక్‌ ప్రొటీన్‌ జెనెటిక్‌ కోడ్‌ను విడుదల చేస్తాయి. తద్వారా కణాలు స్పైక్‌ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తాయి. సార్స్‌కోవ్‌-2 వైరస్‌ను గుర్తించి దాడి చేయడంలో రోగనిరోధక వ్యవస్థకు ఇది దోహదపడుతుంది’ అని అధ్యయన ప్రధాన రచయిత డెనిస్‌ లోగునోవ్‌ వివరించారు. అయితే సార్స్‌కోవ్‌-2కు బలమైన రోగనిరోధకతను ఏర్పరచాలంటే బూస్టర్‌ వ్యాక్సినేషన్‌ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని ఆయన తెలిపారు. కానీ ఒకే అడినోవైరస్‌ వెక్టార్‌ను వినియోగించే బూస్టర్‌ వ్యాక్సినేషన్లు ప్రభావవంతంగా పనిచేయవని, అందుకే తాము రెండు రకాల అడినోవైరస్‌లను వినియోగించినట్లు చెప్పారు. 

40 వేల మందిపై ఫేజ్‌-3 ట్రయల్స్‌

తమ అధ్యయనం చాలా పరిమితమని, తక్కువ మందిపై ట్రయల్స్‌ నిర్వహించినట్లు పరిశోధకులు తెలిపారు. ఫేజ్‌-1లో ఉన్నవారంతా పురుషులేనని పేర్కొన్నారు. ఫేజ్‌-3 హ్యూమన్‌ ట్రయల్స్‌కు ఆగస్టు 26న అనుమతి లభించిందని, ఇందులో అన్ని వయో వర్గాలకు చెందిన 40,000 మందిపై ట్రయల్స్‌ నిర్వహిస్తామన్నారు. 

వచ్చే ఏడాదికీ కష్టమే! కరోనా టీకాపై డబ్ల్యూహెచ్‌వో 

అధికార ప్రతినిధి మార్గరెట్‌  వ్యాఖ్య

జెనీవా: కరోనా వ్యాక్సిన్‌ ఇదిగో అదిగో అంటూ అగ్ర దేశాలు అమెరికా, రష్యా ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనాను సమర్థంగా ఎదుర్కొనేలా విస్తృతమైన వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది మధ్యకాలం నాటికి కూడా చూస్తామని తాము భావించడం లేదని ఆ సంస్థ అధికార ప్రతినిధి మార్గరెట్‌ హ్యారిస్‌ చెప్పారు. శుక్రవారం ఆమె జెనీవాలోని ఐక్యరాజ్యసమితిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. ‘వ్యాక్సిన్‌ తయారీలో అత్యంత కీలకమైనది మూడో దశ పరీక్షలు. ఈ పరీక్షలకు ఎక్కువ సమయం పడుతుంది. అంతేగాక పలు దేశాలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు ఏమేరకు ప్రభావం చూపుతాయో? ఎంత వరకు భద్రమైనవో? అన్న విషయాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి వచ్చే ఏడాది మధ్యకాలం నాటికి విస్తృతమైన వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని మేము భావించడం లేదు’ అని పేర్కొన్నారు. 


logo