శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 11, 2020 , 21:36:24

ఇంజెక్ష‌న్ తీసుకున్నాక‌.. ర‌ష్యా వ్యాక్సిన్ రెండేళ్లు ప‌నిచేస్తుంది !

ఇంజెక్ష‌న్ తీసుకున్నాక‌.. ర‌ష్యా వ్యాక్సిన్ రెండేళ్లు ప‌నిచేస్తుంది !

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్‌కు టీకాను అభివృద్ధిప‌రిచిన‌ట్లు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. త‌మ ఆరోగ్య‌శాఖ కొత్త టీకాను ఆమోదించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఆ టీకాను త‌న కుమార్తె కూడా వేసుకున్న‌ట్లు చెప్పారు. అయితే ఆ వ్యాక్సిన్ ఎంత వ‌ర‌కు మ‌నుషుల‌కు ర‌క్ష‌ణ ఇస్తుందో తెలుసుకుందాం. ర‌ష్యా త‌యారు  చేసిన క‌రోనా టీకా తీసుకున్న‌వారికి రెండేళ్ల వ‌ర‌కు ఎటువంటి వైర‌స్ ద‌రిచేర‌దట‌. ఇంజ‌క్ష‌న్లు తీసుకున్న రెండేళ్ల‌వ‌ర‌కు గ్యారెంటీ ఉంటుంది.  అడినోవైర‌స్ లాంటి వైర‌ల్ వెక్టార్ల‌తో టీకాను త‌యారు చేయ‌డం వ‌ల్ల‌.. ఆ టీకాలు మ‌నుషుల్లో రోగ‌నిరోధ‌క‌శ‌క్తిని పెంచుతాయి.  ర‌ష్యా క‌రోనా టీకాలో రెండు ఇంజెక్ష‌న్లు ఉంటాయి. వీటిని మూడు వారాల వ్య‌వధిలో తీసుకోవాలి.  

జంతువులు,  రెండు గ్రూపుల మ‌నుషుల మీద టీకా ప్ర‌యోగాలు జ‌రిగిన త‌ర్వాత‌నే ర‌ష్యా ఆ టీకాను రిజ‌స్టర్ చేసింది. వ్యాక్సిన్‌తో ఎటువంటి ప్ర‌మాదం లేద‌ని తేల్చారు. క‌రోనాకు వ్య‌తిరేకంగా ఆ టీకాలు రోగ‌నిరోధ‌క‌శ‌క్తిని పెంచుతున్న‌ట్లు గుర్తించారు.  18 నుంచి 60 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న‌వారు ఈ వ్యాక్సిన్‌కు అర్హులు. శ్వాస‌కోస వ్యాధులు ఉన్న‌వారు.. వ్యాధి త‌గ్గేంత వ‌ర‌కు వ్యాక్సిన్ కోసం వేచి ఉండాల్సి ఉంటుంది.  మొద‌ట మెడిక‌ల్ వ‌ర్క‌ర్ల‌కు ఈ వ్యాక్సిన్ ఇవ్వ‌నున్నారు. జ‌న‌వ‌రి 2021 నుంచి సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ర‌ష్యా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది.  గ‌మ‌లేయా రీస‌ర్చ్ ఇన్స్‌టిట్యూట్‌తో పాటు ఫార్మా కంపెనీ ఏఎఫ్‌కే సిస్టెమా ఈ టీకాల‌ను ఉత్పత్తి చేస్తుంది. ఏడాదికి 15 ల‌క్ష‌ల డోస్‌లు ఉత్ప‌త్తి చేయ‌నున్నారు. టీకా ఉత్ప‌త్తిపై ర‌ష్యా మ‌రో 5 దేశాల‌తో ఒప్పందం కుదుర్చుకున్న‌ది. 12 నెల‌ల్లో సుమారు 5 కోట్ల డోస్‌లు త‌యారు చేసేందుకు ఆ ఒప్పందం కుదిరింది. 

గామ్‌-కోవిడ్‌-వాక్ అనే పేరుతో ఈ వ్యాక్సిన్‌ను రిజిస్ట‌ర్ చేశారు. కానీ స్పుత్నిక్-వీ పేరుతో ఈ టీకాను పంపిణీ చేయ‌నున్నారు. సోవియేట్ ర‌ష్యాను స్పుత్నిక్ శాటిలైట్ మార్చేసిన‌ట్లు.. ప్ర‌స్తుత క‌రోనా మ‌హమ్మారి నుంచి స్పుత్నిక్ టీకా ర‌క్షిస్తుంద‌ని ర‌ష్యా భావిస్తున్న‌ది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో వ్యాక్సిన్ ప‌రీక్ష‌లు మొద‌లైన‌ట్లు గ‌మ‌లేయా ఇన్స్‌టిట్యూట్ డైర‌క్ట‌ర్ డెన్నిస్ తెలిపారు.కేవ‌లం రెండు వారాల్లోనే వ్యాక్సిన్ ప‌రిశోధ‌న పూర్తి చేశామ‌న్నారు.
logo