శనివారం 04 ఏప్రిల్ 2020
International - Jan 16, 2020 , 12:26:53

రష్యా నూతన ప్రధానిగా మిషుస్తిన్‌?

రష్యా నూతన ప్రధానిగా మిషుస్తిన్‌?

మాస్కో : రష్యా నూతన ప్రధానిగా మైఖైల్‌ మిషుస్తిన్‌(53) పేరును ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రతిపాదించారు. ప్రస్తుతం మిషుస్తిన్‌ ఫెడరల్‌ ట్యాక్స్‌ సర్వీసెస్‌ అధినేతగా కొనసాగుతున్నారు. పుతిన్‌ రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించిన నేపథ్యంలో ప్రధాని దిమిత్రి మెద్వెదేవ్‌ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామా పత్రాన్ని పుతిన్‌కు మెద్వెదేవ్‌ సమర్పించారు.


మంత్రివర్గం, రాజ్యాంగంలో సంస్కరణలపై భేటీ తర్వాత మెద్వెదేవ్‌ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. నూతన మంత్రివర్గం ఏర్పాటయ్యే వరకు పని చేయాలని మెద్వెదేవ్‌ మంత్రివర్గాన్ని అధ్యక్షుడు పుతిన్‌ కోరినట్లు తెలుస్తోంది. ఇక మెద్వెదేవ్‌తో పాటు తన మంత్రివర్గం రాజీనామా చేసే కంటే ముందు.. ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దిమిత్రి రాజీనామా నేపథ్యంలో ఆయనను ప్రెసిడెన్షియల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డిప్యూటీగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మెద్వెదేవ్‌ను పుతిన్‌ ప్రశంసించారు. మెద్వెదేవ్‌ దేశం కోసం గొప్ప కృషి చేశారని పుతిన్‌ కొనియాడారు. 2012 నుంచి రష్యా ప్రధానిగా మెద్వెదేవ్ కొనసాగుతున్నారు. అంతకుముందు 2008 నుంచి 2012 వరకు రష్యా ప్రెసిడెంట్ గా దిమిత్రి సేవలందించారు.

ఇక మిషుస్తిన్ మాస్కోలో జన్మించారు. 1990లలో ఐటీ నిపుణుడిగా పని చేశారయన. 1998 నుంచి ట్యాక్స్ సర్వీస్ అధికారిగా సేవలందించారు. ఆ తర్వాత డిప్యూటీ ట్యాక్స్ మినిస్టర్ గా పని చేశారు. 2008లో రష్యా పెట్టుబడి సంస్థ అయిన యూ ఎఫ్ జీ కంపెనీలో పని చేశారు మిషుస్తిన్. 2010 నుంచి రష్యా ఫెడరల్‌ ట్యాక్స్‌ సర్వీసెస్‌ అధినేతగా మిషుస్తిన్ కొనసాగుతున్నారు. రష్యా ఐస్ హాకీ ఫెడరేషన్ బోర్డులో మిషుస్తిన్ ఒక మెంబర్ కూడా.


logo