గురువారం 26 నవంబర్ 2020
International - Oct 28, 2020 , 18:49:21

చంద్రుడిపై నీటిని రష్యా ఎప్పుడో కనుగొన్నది : రష్యన్‌ మీడియా

చంద్రుడిపై నీటిని రష్యా ఎప్పుడో కనుగొన్నది : రష్యన్‌ మీడియా

మాస్కో : చంద్రుడిపై నీటిని కనుగొన్నామని అమెరికాకు చెందిన నాసా ప్రకటించడాన్ని రష్యాకు చెందిన మీడియా అవహేళన చేసింది. నాసా శాస్త్రవేత్తలు సోవియట్‌ సహచరుల నుంచి కొంచెం ఎక్కువ రచనలు చదివితే రష్యా ఏనాడో చంద్రుడిపై నీటి జాడలను గుర్తించిన విషయం తెలిసేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాయి. సోవియట్‌ యూనియన్‌కు చెందిన లూనా 24 ద్వారా 44 ఏండ్ల క్రితమే ఈ ఆవిష్కరణ చేసిందని తెలుసుకోకుండా ఇప్పుడు ఈ ప్రకటన చేఊయడం హాస్యాస్పదంగా ఉన్నదని విమర్శలు చేశాయి. 

చంద్రుడి ఉపరితలంపై సూర్యరశ్మి పడే ప్రాంతాల్లో నీటి జాడలను స్ట్రాటోస్పెరిక్‌ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రారెడ్ ఆస్ట్రానమీ (సోఫియా) మొదటిసారిగా ధ్రువీకరించిందని రెండు రోజుల క్రితం అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ప్రపంచానికి తెలియజేసింది. చంద్రుడి సహజ వనరులను గుర్తించడం ద్వారా నాసా చంద్ర స్థావరాన్ని స్థాపించడంలో సహాయపడుతుందని పేర్కొంటూ నాసా ఈ ఆవిష్కరణను ప్రకటించింది. అయితే, దాదాపు యాభై ఏండ్ల క్రితం యూఎస్‌ఎస్‌ఆర్ చంద్రుడిపై నీటిని కనుగొన్నట్లు రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని మీడియా స్పుత్నిక్ తన నివేదికలో పేర్కొన్నది. "నాసా శాస్త్రవేత్తలు తమ సోవియట్ సహచరుల నుండి కొంచెం ఎక్కువ రచనలు చదివితే, సోవియట్ యూనియన్ లూనా 24 ద్వారా 1976 లో ఈ ఆవిష్కరణ చేసిందని వారు గ్రహించి ఉండవచ్చు" అని స్పుత్నిక్ తన నివేదికలో ఆరోపించింది. 

"యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (యూఎస్ఎస్ఆర్) చంద్రుడు, శుక్రుడితోపాటు బాహ్య అంతరిక్షంలోని వివిధ వస్తువులకు డజన్ల కొద్దీ పరిశోధనలను పంపించి, సౌర వ్యవస్థపై మానవాళికి ఉన్న జ్ఞానానికి దోహదపడింది. అయినప్పటికీ, పాశ్చాత్య శాస్త్రవేత్తలు తప్పుగా చదివారు" అని మీడియా నివేదిక తెలిపింది. ఇది 1978 లో యూఎస్ఎస్ఆర్ యొక్క అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ లో ప్రచురించిన కాగితాన్ని హైలైట్ చేస్తూ.. ఇది మేర్‌ క్రిసియం బిలంలో చంద్ర ఉపరితలంపై నీటిని కనుగొన్నట్లు ప్రకటించింది. 1978 లో ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన 'లూనా 24 రెగోలిత్ ఫ్రమ్ ది సీ ఆఫ్ క్రైసెస్' శీర్షికతో వచ్చిన వార్తలు కూడా వీటిని ధ్రువీకరిస్తున్నాయని స్పుత్నిక్ తన నివేదికలో స్పష్టంచేసింది. 2011 లో కొలంబియా విశ్వవిద్యాలయంలోని అమెరికన్‌ శాస్త్రవేత్తలు.. యూఎస్ఎస్ఆర్ యొక్క లూనా 24 నుంచి నమూనాలను పరీక్షించారు. అలాగే, చంద్రుని మట్టిలో సుమారు 0.1 శాతం నీరు ఉన్నట్లు కనుగొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.