శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Sep 02, 2020 , 15:39:21

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా వేలు !

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా వేలు !

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా వేలు పెట్టిందని గత ఎన్నికల సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. 2020 లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నది. ఈ విషయాన్ని ఫేస్ బుక్, ట్విట్టర్ మంగళవారం వెల్లడించాయి. నవంబర్‌లో జరిగే ఎన్నికలను ప్రభావితం చేయడానికి రష్యాతోపాటు ఇతర దేశాలు ప్రయత్నించవచ్చని అమెరికా గూఢాచార సంస్థలు చాలా నెలల క్రితమే హెచ్చరించాయి. సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా అమెరికన్లను మోసం చేయడానికి రష్యా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కుట్ర చేస్తున్నాయని అవి పేర్కొన్నాయి. ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్ సంస్థల బయటపెట్టిన ఆధారాలు రష్యన్ జోక్యానికి నిదర్శనం కానున్నాయి.

నకిలీ ఖాతాలు, వెబ్‌సైట్ల నెట్‌వర్క్‌ను సృష్టించిన రష్యా.. వీటి ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడానికి కుట్ర పన్నారు. ఈ ప్రచారాన్ని ఇంటర్నెట్ రీసెర్చ్ ఏజెన్సీ అంటారు. ఈ ఏజెన్సీ ఓటర్లను డెమోక్రటిక్ పార్టీ నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నది. నాలుగేండ్ల క్రితం ఇదే పని చేసినట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ సైట్‌లకు యాక్సెస్ లేకుండా ఇంటర్నెట్ రీసెర్చ్ ఏజెన్సీ గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చాలా చురుకుగా ఉంది. ఫేక్ నెట్‌వర్క్, సైట్ ప్రస్తుతం గతంలో ఉన్నంతగా ప్రజలకు అందుబాటులో లేదు. ఈ వెబ్‌సైట్ల కోసం పనిచేయడానికి అమెరికన్ పౌరులను రష్యా నియమించుకున్నది. రష్యన్ సైట్కు పీస్‌డేటా అని పేరు పెట్టారు. ఇది ఒక వార్తా సంస్థ మాదిరిగా కనిపిస్తుంది. ఎడిటర్స్ పేర్లు, ఫొటోలు కూడా ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయి. కానీ ఇవన్నీ నకిలీవే. 

అక్టోబర్‌లో ప్రారంభమైన పీస్‌డేటా

ఫేస్ బుక్ అందజేసిన సమాచారం మేరకు.. ఫేక్ న్యూస్ సైట్ పీసెడేటా మరొక సైట్ ద్వారా ప్రకటనలు ఇస్తుంది. శాంతిని ప్రోత్సహించడానికి 13 నకిలీ ఖాతాలు, రెండు పేజీలు కూడా సృష్టించారు. 14 వేల మంది ఈ పేజీలను అనుసరిస్తున్నారు. ఈ సైట్ మొట్టమొదట 2019 అక్టోబర్ నెలలో యాక్టివేట్ అయింది. 2020 మార్చి నెల నుంచి తన సొంత కథనాలను ప్రచురించడం ప్రారంభించింది. ఈ సైట్‌లో ముగ్గురు సంపాదకుల ఫొటోలు ఉన్నాయి. అయితే, దర్యాప్తులో అవి నకిలీవని తేలింది. రష్యాకు చెందిన ఫేక్ వెబ్‌సైట్లు అమెరికన్ రచయితల నుంచి వ్యాసాలు రాయడానికి ప్రకటనలు పొందుతున్నాయి. ఒక రచయిత తాను రష్యన్ వెబ్‌సైట్ పీస్‌డేటా కోసం కూడా రాశానని చెప్పారు. మొదటి వ్యాసంలో డెమోక్రటిక్ పార్టీని ప్రశ్నించగా.. అతడి వ్యాసానికి 75 డాలర్లు (రూ. ఐదున్నర వేలు) వచ్చాయి. 

ఫేస్‌బుక్‌తో సైట్ గురించి సమాచారాన్ని సేకరిస్తున్న నెట్‌వర్క్ అనలిటిక్స్ సంస్థ గ్రాఫికాకు చెందిన బెన్ నిమ్మో, "రష్యా తన సైట్‌లను బలపరుస్తున్నది. ఇది చాలా అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నది" అని తెలిపింది. ఫేస్ బుక్, ట్విట్టర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు 2016 ఎన్నికలలో తప్పుడు సమాచారంపై పెద్దగా చర్యలు తీసుకోలేదు. ఇది రెండింటిపై విమర్శలకు దారితీసింది. ఉద్యోగులు కూడా సంస్థను విమర్శించారు. దీని తరువాత రష్యా జోక్యంపై ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) రెండు సంస్థలను హెచ్చరించింది.


logo