బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Jan 17, 2020 , 03:54:10

పుతిన్‌కు శాశ్వత అధికారం!

పుతిన్‌కు శాశ్వత అధికారం!
  • రష్యాలో రాజకీయ సంస్కరణలు
  • జీవించి ఉన్నంతకాలం అధికారం చెలాయించే దిశగా పుతిన్‌ ఎత్తు గడలు
  • ప్రధాని మెద్వదేవ్‌ రాజీనామా

మాస్కో, జనవరి 15: రష్యాలో తాను జీవించి ఉన్నంతకాలం అధికారం చెలాయించే దిశగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రాజకీయ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. చట్టసభ సభ్యులే ప్రధాన మంత్రిని, మంత్రివర్గాన్ని ఎన్నుకోవాలని, అధికారంలో వారికి పూర్తి స్వేచ్ఛనివ్వాలని పేర్కొంటూ ప్రధాని దిమిత్రీ మెద్వదేవ్‌ సంస్కరణలను ప్రతిపాదించారు. పుతిన్‌కు ఎంతో విశ్వసనీయుడైన మెద్వదేవ్‌.. సంస్కరణలను ప్రతిపాదించిన వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. మెద్వదేవ్‌ స్థానంలో ప్రధానిగా ఎంపికయ్యేందుకు ప్రస్తుతం పన్ను సేవల అధికారిగా ఉన్న మిఖాయిల్‌ మిశుస్తిన్‌ ప్రయత్నిస్తున్నారు. రష్యా డ్యూమా (పార్లమెంట్‌) నూతన ప్రధానిని ఎన్నుకోనుంది. పుతిన్‌ బుధవారం దేశప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, సంస్కరణల గురించి వివరించారు. ప్రభుత్వంలో పార్లమెంట్‌కు, పార్టీలకు మరిన్ని బాధ్యతలు అప్పగించనున్నామని, ప్రధానమంత్రికి, మంత్రివర్గ సభ్యులకు మరిన్ని అధికారాలను, స్వేచ్ఛను ఇవ్వనున్నామని తెలిపారు. పార్లమెంటరీ వ్యవస్థ పాలనలో దేశం మరింత స్థిరంగా ఉంటుందని చెప్పారు. మరోవైపు, ఈ సంస్కరణల వెనుక పుతిన్‌ అధికార కాంక్ష దాగి ఉన్నదని, తాను కోరుకున్నంత కాలం అధికారంలో ఉండేలా మార్పులు తెస్తున్నారని పలువురు ప్రతిపక్ష నేతలు విమర్శించారు.

ఏండ్లుగా అధికార పీఠంపై..

పుతిన్‌ వరుసగా రెండుసార్లు 2000-2008 వరకు దేశ అధ్యక్షునిగా కొనసాగారు. రష్యా రాజ్యాంగం ప్రకారం వరుసగా రెండుమార్లు అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి తప్పనిసరిగా గద్దె దిగాలి. దీంతో అధ్యక్ష స్థానంలో దిమిత్రీ మెద్వదేవ్‌ను కూర్చోబెట్టిన పుతిన్‌.. తాను ప్రధానిగా కొనసాగారు. పుతిన్‌ సూచనల మేరకు మెద్వదేవ్‌ దేశాధ్యక్షుడి పదవీ కాలాన్ని నాలుగేండ్ల నుంచి ఆరేండ్లకు పెంచారు. దీంతో 2012లో మరోసారి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన పుతిన్‌ 2018లో మళ్లీ ఎన్నికయ్యారు. 2024 వరకూ ఆయన అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. అయితే ఆ తరువాత ఆయన మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారని, అందుకే ప్రధానికి మరిన్ని విస్తృతాధికారాలు కట్టబెడుతూ సంస్కరణలు తీసుకొచ్చారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 2024లో తన అనుచరుడు మెద్వదేవ్‌కు మళ్లీ అధ్యక్ష పదవిని అప్పగించేందుకే ఇప్పుడు ఆయనతో రాజీనామా చేయించారని ఆరోపిస్తున్నాయి. శక్తిమంతమైన, ప్రభావవంతమైన ప్రధానిగా పుతిన్‌ తన అధికారాలను కొనసాగిస్తారని, అధ్యక్ష పదవి అలంకార ప్రాయంగా మారిపోతుందని రాజకీయ విశ్లేషకుడు దిమిత్రీ ఒరెష్కిన్‌ పేర్కొన్నారు.


logo