శనివారం 05 డిసెంబర్ 2020
International - Nov 01, 2020 , 21:12:12

జో బిడెన్‌దే విజయం : సైబీరియన్‌ ఎలుగుబంటి, పులి జోస్యం

జో బిడెన్‌దే విజయం : సైబీరియన్‌ ఎలుగుబంటి, పులి జోస్యం

ఎల్లుండి జరుగనున్న అమెరికన్‌ అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్‌ జో బిడెన్‌నే విజయం వరించనున్నది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై బిడెన్‌ ఘనవిజయం సాధిస్తారని సైబీరియాకు చెందిన ఓ ఎలుగుబంటి జోస్యం చెప్పింది. 2016 ఎన్నికల్లో కూడా ఈ ఎలుగుబంటి చెప్పినదే నిజమై హిల్లరీ క్లింటన్‌పై డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుపొందారు. అదే ఎలుగుబంటి ఈసారి ట్రంప్‌ వైపు కాకుండా బిడెన్‌ను ఎంచుకున్నది.

నవంబర్ 3 జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంపై ప్రపంచవ్యాప్తంగా చాలా మంది రాజకీయ భవిష్య సూచకులు ఎప్పటినుంచే తమతమ వాదనలు వినిపిస్తున్నారు. రష్యా వారు సమాధానం తెలుసుకోవడానికి అసాధారణమైన విధానాన్ని ఉపయోగించారు. వీరి విధానంలో నిపుణులు రెండు పులులు, ఒక ఎలుగుబంటితో పుచ్చకాయలపై అభ్యర్థుల ఫొటోలను ముద్రించి తీసుకువచ్చి ఉంచి వాటి జోస్యాన్ని గుర్తించారు. తమాషా ఏంటంటే.. రెండు పులులతోపాటు ఎలుగుబంటి కూడా జో బిడెన్‌దే విజయం అని సంకేతాలిచ్చాయి.

మాస్కో టైమ్స్‌లో నివేదించిన ప్రకారం, సైబీరియాలోని క్రాస్నోయార్స్క్‌లోని రాయెవ్ రోచీ జూలో నివసిస్తున్న రెండు పులులు, ఒక ఎలుగుబంటితో జోస్యం చెప్పించారు. వీటికి ట్రంప్‌, బిడెన్‌ ముద్రించిన పుచ్చకాయలను అందించి ఏ పుచ్చకాయతో ఆకర్షణ చెందుతాయో అంచనా వేశారు. మొదట ఖాన్ అనే తెల్ల బెంగాల్ పులి.. ట్రంప్ పుచ్చకాయను పట్టించుకోలేదు. బిడెన్‌పై తన దృష్టిని కేంద్రీకరించింది. అముర్ అనే మరో పులి కొంత ఆలోచన తరువాత బిడెన్ పుచ్చకాయను పూర్తిగా పగులగొట్టింది. బుయాన్ అనే ఎలుగుబంటి తన ఎంపికలో బిడెన్ పుచ్చకాయ ముట్టుకున్నది. దాంతో బిడెన్‌ విజయం ఖాయమైనట్లేనని రాయెవ్‌ రోచీ జూ సిబ్బంది చెప్తున్నారు. ఈ జూ ఎపిసోడ్‌ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో బిడెన్‌కు కావాల్సినంత ప్రచారం వచ్చినట్లయింది. 

అయితే, బుయాన్ అనే ఎలుగుబంటి 2018 ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌ విజేతను అంచనా వేయడంతోపాటు 2019 ఉక్రేనియన్ అధ్యక్ష ఎన్నికలలో వోలోడోమైర్ జెలెన్స్కీ విజయాన్ని అంచనా వేయడంలో విఫలమైందని పలువురు నెటిజెన్లు గుర్తుచేస్తున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.