మంగళవారం 27 అక్టోబర్ 2020
International - Sep 27, 2020 , 22:20:06

త్వరలోనే రష్యా రెండో కొవిడ్‌ టీకా రిజిస్టర్‌!

త్వరలోనే రష్యా రెండో కొవిడ్‌ టీకా రిజిస్టర్‌!

మాస్కో: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేసే మొదటి టీకాను రిజిస్టర్‌ చేసిన రష్యా.. త్వరలోనే రెండో వ్యాక్సిన్‌తో ముందుకొస్తోంది. తమ దేశంలో రెండో కొవిడ్‌ టీకాను రిజిస్టర్‌ చేయబోతున్నామని ఆ దేశ అధ్యక్షుడు  వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. రష్యా ఎగువ సభ చట్టసభ సభ్యులతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.  

వెక్టర్ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన ఎపివాక్ కరోనాగా పిలుస్తున్న మరో వ్యాక్సిన్‌ను అక్టోబర్‌ 15 లోగా రిజిస్టర్‌ చేస్తామని నేషనల్‌ కన్జ్యూమర్‌ హెల్త్‌ వాచ్‌డాగ్ తెలిపింది. అలాగే, కొవిడ్‌ను ఎదుర్కోవడంలో దేశ సామర్థ్యాన్ని పుతిన్ అభినందించారు. కొవిడ్‌-19 ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా, జాన్స్‌ హాప్కిన్స్‌ వర్సిటీ ప్రకారం..కొవిడ్ కేసుల సంఖ్యలో రష్యా ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటివరకూ ఆ దేశంలో 11,17,487 కేసులు నమోదు కాగా, 19,720 మంది మరణించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo