శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
International - Jan 25, 2021 , 01:57:04

అట్టుడుకుతున్న రష్యా

అట్టుడుకుతున్న రష్యా

  • నావల్నీకి మద్దతుగా పెద్ద ఎత్తున నిరసనలు
  • 100కు పైగా నగరాల్లో ఆందోళనలు
  • 3500 మందికిపైగా అరెస్ట్‌

మాస్కో: ఇంతకుముందెన్నడూ లేని రీతిలో రష్యా నిరసనలతో అట్టుడుకుతున్నది. ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీని విడుదల చేయాలంటూ దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా వేలాది మంది స్వచ్ఛందంగా నిరసనల్లో పాల్గొంటున్నారు. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని నావల్నీ పిలుపునివ్వడంతో నిరసనోద్యమం రాజుకున్నది. మరోవైపు ఆందోళనకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటివరకు 3,500 మందికిపైగా అరెస్ట్‌ చేశారు. వారిలో నావల్నీ భార్య యూలియా కూడా ఉన్నారు. గతేడాది నావల్నీపై విషప్రయోగం జరిగిన విషయం తెలిసిందే. జర్మనీలో చికిత్స పొందిన ఆయన గతవారం రష్యాకు చేరుకోగా విమానాశ్రయంలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

 పుతిన్‌ స్పందన ఏమిటి?

నావల్నీ వెనుక అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ హస్తముందని పుతిన్‌ ఆరోపిస్తున్నారు. నావల్నీపై విషప్రయోగం చేయాల్సిన అవసరం తమకు లేదని పేర్కొన్నారు. ఒకవేళ నావల్నీని చంపాలనుకుంటే, రష్యా నిఘా సంస్థలు ఆ పని ఎప్పుడో పూర్తిచేసేవని వ్యాఖ్యానించారు. కాగా, పుతిన్‌ ప్యాలెస్‌ పేరుతో గతవారం యూట్యూబ్‌లో ఒక వీడియో అప్‌లోడ్‌ అయింది. ఆ ప్యాలెస్‌ను కొనేందుకు పుతిన్‌కు సన్నిహితులైన వ్యాపారవేత్తలే చెల్లించారని అందులో నావల్నీ ఆరోపించారు. 

ఎవరీ నావల్నీ?

నావల్నీ న్యాయవాద వృత్తి నుంచి రాజకీయం వైపు మళ్లారు. ఒక బ్లాగ్‌ ద్వారా రష్యా ప్రభుత్వ అవినీతిని బయటపెట్టడంతో 2008లో నావల్నీ పేరు వెలుగులోకి వచ్చింది. 2018లో పుతిన్‌కు వ్యతిరేకంగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయకుండా ఆయనను అడ్డుకున్నారు. అవినీతికి వ్యతిరేకంగా నావల్నీ పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహించారు. తద్వారా రష్యాలో ప్రతిపక్ష నాయకుడిగా అవతరించారు. నావల్నీపైనా గతేడాది విషప్రయోగం జరిగింది. పుతిన్‌ను బలంగా విమర్శిస్తున్న నావల్నీని ఎక్కువ కాలం జైలులో నిర్బంధించి అణగదొక్కాలని ప్రభుత్వం చూస్తున్నదని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. 

VIDEOS

logo