మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Aug 12, 2020 , 02:26:14

కరోనా టీకా వచ్చేసింది

కరోనా టీకా వచ్చేసింది

  • స్పుత్నిక్‌-వీ పేరిట తొలి వ్యాక్సిన్‌
  • రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటన.. తన కూతురికీ ఇచ్చినట్టు వెల్లడి
  • భారీగా డోసుల తయారీ.. 2021 నుంచి రష్యన్లందరికీ టీకా
  • తొలి ప్రాధాన్యం డాక్టర్లు, టీచర్లకు .. త్వరలో వాణిజ్యపరంగా ఉత్పత్తి 
  • వ్యాక్సిన్‌ కోసం రష్యాను కోరిన భారత్‌ సహా 20 దేశాలు
  • వేగం కాదు భద్రత ముఖ్యం.. రష్యా వ్యాక్సిన్‌ ప్రకటనపై అమెరికా 

మాస్కో, ఆగస్టు 11: యావత్‌ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కరోనా టీకా వచ్చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను తాము రూపొందించామని, దానిని అధికారికంగా రిజిస్టర్‌ చేయించామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మంగళవారం ప్రకటించారు. ‘స్పుత్నిక్‌-వీ’ పేరుతో తయారుచేసిన ఈ టీకాను తన కూతురుకు కూడా ఇచ్చినట్టు చెప్పారు. రష్యా రక్షణశాఖతో కలిసి ఆ దేశానికే చెందిన గమలేయా రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. వచ్చే ఏడాది జనవరి 1నుంచి తమ దేశప్రజలందరికీ వ్యాక్సిన్‌ వేయనున్నట్టు రష్యా రిజిస్టర్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్స్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. ప్రాధాన్య క్రమంలో ముందుగా వైద్యులు, ఉపాధ్యాయులకు వ్యాక్సిన్‌ ఇస్తామని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్‌ మురష్కో తెలిపారు. అయితే రష్యా ప్రకటనపై అమెరికా పెదవి విరిచింది. అందరికంటే ముందుగా వ్యాక్సిన్‌ తేవటం ముఖ్యంకాదని, అత్యంత భద్రమైన వ్యాక్సిన్‌ తయారుచేయటమే ప్రధానమని అమెరికా ఆరోగ్యశాఖ మంత్రి అలెక్స్‌ అజర్‌ వ్యాఖ్యానించారు.

శక్తిమంతం.. సురక్షితం

రష్యా టీకాపై వ్యక్తమవుతున్న సందేహాలను పుతిన్‌ తోసిపుచ్చారు. వ్యాక్సిన్‌ శక్తిమంతం.. సురక్షితం అని ప్రకటించారు. ‘నా కుమార్తెల్లో ఒకరికి మొదటిసారి వ్యాక్సిన్‌ వేసినప్పుడు ఆమె శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఆ తర్వాతి రోజు 37 డిగ్రీలకు తగ్గింది. రెండోసారి వ్యాక్సిన్‌ వేసినప్పుడు కూడా అలాగే జరిగింది. అంతకుమించి ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. వ్యాక్సిన్‌ వేసిన తర్వాత ఆమెలో భారీఎత్తున యాంటీబాడీలు (వైరస్‌తో పోరాడే ప్రతిరక్షకాలు) ఉత్పత్తి అయ్యాయి’ అని పుతిన్‌ తెలిపారు. రష్యా జరిపిన ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రయోగాల్లో స్పుత్నిక్‌ ఉపగ్రహం ఒకటి. ఈ ఉపగ్రహం పేరు మీదుగానే తాజాగా కరోనా టీకాకు స్పుత్నిక్‌-వీ అనే పేరు పెట్టారు. 

రెండు ఇంజెక్షన్లుగా వ్యాక్సిన్‌ 

రష్యా తయారుచేసిన కరోనా టీకాను రెండు ఇంజెక్షన్లుగా వేస్తారు. వీటి ద్వారా ఇచ్చే ఔషధం శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. తద్వారా కరోనా వైరస్‌ను నిర్మూలిస్తుంది. క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న ఏ ఒక్కరిలోనూ దుష్ప్రభావాలు కనిపించలేదని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్‌ మురష్కో తెలిపారు. వ్యాక్సిన్‌ను గమలేయా రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు బిన్నొఫార్మా సంస్థలో ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. టీకా వాణిజ్య ఉత్పత్తిని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. వందకోట్ల డోసుల కోసం ఇప్పటికే భారత్‌ సహా 20 దేశాలు తమను సంప్రదించాయని ఆర్డీఐఎఫ్‌ డైరెక్టర్‌ కిరిల్‌ దిమిత్రివ్‌ తెలిపారు. ఐదు భాగస్వామ్య దేశాలతో కలిసి 50 కోట్ల డోసుల ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 


నామమాత్రపు ప్రయోగాలు?

గమలేయా సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్‌పై క్లినికల్‌ ట్రయల్స్‌ నామమాత్రంగా నిర్వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్‌ గురించి బయటి ప్రపంచానికి తెలియకుండా చివరివరకు గోప్యత పాటించారు. కేవలం 38మంది వలంటీర్లపైనే ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించారని వార్తలు వచ్చాయి. జూన్‌ 18న క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. మొదటి వలంటీర్ల బృందాన్ని జూలై 15న , రెండో బృందాన్ని జూలై 20న ఇండ్లకు పంపించారు.

వివిధ దశల్లో 139 వ్యాక్సిన్లు 

కరోనా చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా 139 వ్యాక్సిన్లు వివిధ ప్రయోగాల దశలో ఉన్నాయి. 25 టీకాలు ఫేజ్‌- 1దశలో, 17 ఫేజ్‌-2, 7 వ్యాక్సిన్లు ఫేజ్‌-3దశ క్లినికల్‌ ప్రయోగాలను జరుపుకొంటున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా, మోడెర్నా-ఎన్‌ఐఏఐడీ, సైనోవాక్‌ వ్యాక్సిన్లపై తుది దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌, బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, బయోన్‌టెక్‌-వూసన్‌ ఫార్మా, భారత్‌ బయోటెక్‌, క్యాడిలా వ్యాక్సిన్లు రెండోదశలో ఉన్నాయి.

అనుమానాలు.. ఆరోపణలు

తమ టీకా తుదిదశ ప్రయోగాల్లో ఉన్నదని జూన్‌లో రష్యా సంస్థ గమలేయా ప్రకటించినప్పుడే ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఈ ప్రకటనపై అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ అప్పుడే అనుమానాలు వ్యక్తం చేశాయి. తమ దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌పై జరుగుతున్న పరిశోధనల వివరాలను హ్యాకింగ్‌ ద్వారా రష్యా తస్కరించిందని ఆరోపించాయి. దీనిని రష్యా ఖండించినప్పటికీ తమ పరిశోధన వివరాలను బహిర్గతం చేయలేదు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రష్యా వ్యాక్సిన్‌ వివరాలు తమకేమీ తెలియవని ఇటీవల ప్రకటించింది.


logo