సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 14, 2020 , 01:48:48

టీకా.. తికమక!

టీకా.. తికమక!

న్యూఢిల్లీ: రష్యా కరోనా టీకా స్పుత్నిక్‌-వీ మీద ప్రపంచ దేశాలు అయోమయంలో పడ్డాయి. సరైన ప్రమాణాలు, క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించకుండానే ఆ టీకాను తయారుచేశారన్న సందేహాల నేపథ్యంలో దానిని కొనుగోలు చేయాలా.. వద్దా.. అన్నదానిపై తర్జనభర్జన పడుతున్నాయి. కొన్ని దేశాలు తాము ఆ టీకా మీద పరీక్షలు నిర్వహించిన తర్వాతే కొంటామని ప్రకటిస్తుండగా.. మరికొన్ని దేశాలు ఎందుకైనా మంచిదని కొనుగోలుకు ముందస్తు ఆర్డర్లు ఇస్తున్నాయి. మరోవైపు, స్పుత్నిక్‌-వి తయారీ, భద్రతపై శాస్త్రవేత్తలు, వైద్యనిపుణుల విమర్శలు మాత్రం ఆగడం లేదు. కరోనాకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా టీకా తయారు చేశామన్న రష్యా ప్రకటనను మన దేశానికి చెందిన ప్రముఖ ఔషధ కంపెనీ బయోకాన్‌ ఎండీ కిరణ్‌ మజుందార్‌ షా గురువారం తోసిపుచ్చారు. క్లినికల్‌ ట్రయల్స్‌ వివరాల్ని బహిర్గతం చేయకుండా సురక్షితమైనదని ఎలా చెప్తారని ప్రశ్నించారు. అంతకన్నా మెరుగైన టీకాలు అనేక దేశాల్లో అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు. ‘మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరగకుండానే టీకాను మార్కెట్‌లోకి తీసుకురావడం రష్యా ప్రజలకు ఆమోదయోగ్యమైతే అలాగే కానీ (ప్రపంచంలోని ఇతర దేశాలకు మాత్రం ఆమోదయోగ్యం కాదు). అయితే దానిని కొవిడ్‌కు మొట్టమొదటి టీకా అని అభివర్ణించటం సరికాదు’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా బ్రెజిల్‌లోని పరానా రాష్ట్రం స్పుత్నిక్‌-విని తమ ప్రాంతంలో ఉత్పత్తి చేయడంపై బుధవారం రష్యాతో ఒప్పందం చేసుకున్నది. అయితే పరానా రాష్ట్రం బ్రెజిల్‌ కేంద్రప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు తీసుకున్నదా.. లేదా.. అన్న వివరాలు ఇంకా తెలియలేదు. స్పుత్నిక్‌-విపై అక్టోబరులో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తామని ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. బుధవారం ఇజ్రాయెల్‌ కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. ఆక్స్‌ఫర్డ్‌, అస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకాను ఉత్పత్తి చేయడానికి అర్జెంటీనా, మెక్సికో ఒప్పందం చేసుకున్నాయి.

18-60 ఏండ్ల వారికే రష్యా టీకా

మాస్కో: స్పుత్నిక్‌-వీ టీకా ప్రస్తుతానికి 18-60 ఏండ్ల మధ్య వయసు ఉన్న వారికి మాత్రమే పనిచేస్తుందని రష్యా వైద్య నిపుణులు చెబుతున్నారు. వృద్ధులపై టీకా ప్రభావం గురించి తెలుసుకోవడానికి మరిన్ని క్లినికల్‌ ట్రయల్స్‌ చేయాల్సిన అవసరమున్నదని తెలిపారు. మరోవైపు, చివరి దశ పరీక్షల్లో ఇప్పటివరకూ తొమ్మిది వ్యాక్సిన్‌లు ఉన్నాయని, ఈ జాబితాలో రష్యా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌-వీ’ లేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.


logo