గురువారం 02 జూలై 2020
International - Jun 20, 2020 , 20:13:01

భారత్‌-చైనా మధ్యలో రష్యా

భారత్‌-చైనా మధ్యలో రష్యా

న్యూఢిల్లీ: భారత్‌, చైనా మధ్య సైనిక ఉద్రిక్తతలను తగ్గించడానికి రష్యా తెరవెనుక ప్రయత్నాలను ప్రారంభించింది. ఇందులోభాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిలతో కూడిన త్రైపాక్షిక చర్యలను రష్యా ప్రారంభించింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ త్రైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. రష్యా దౌత్యక్రియాశీలత చర్చలు మూడు రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. భారత్‌, చైనాలతో పాటు రష్యా ఉప విదేశాంగ మంత్రి ఇగోర్‌ మోర్గులోవ్‌ ప్రాంతీయ భద్రత గురించి చర్చించారు. 

గల్వాన్‌ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగి భారత్‌కు చెందిన కల్నల్‌ స్థాయి అధికారితోపాటు 20 మంది సైనికులు చనిపోయారు. ఫలితంగా రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఈ ఘర్షణ ఇకముందు కూడా కొనసాగకుండా ఉండేందుకు రష్యా తన ప్రయత్నాలను మొదలుపెట్టింది. త్రైపాక్షిక చర్చల గురించి రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ వివరాలు వెల్లడించలేదు. 

రెండు హిమాలయ పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలను ముందస్తుగా పరిష్కరించడంలో మాస్కోకు ప్రపంచ స్థాయిలో ఎక్కువ వాటా ఉన్నదని రష్యా దౌత్య వర్గాలు వెల్లడించాయి. భారత, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగడం షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌పై భారీ ప్రతికూల ప్రభావాన్ని చూపడమే కాకుండా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) సమూహం కింద అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల పెరుగుదలపై కూడా ప్రభావం చూపుతుందని ఆ వర్గాలు తెలిపాయి. భారత్‌, చైనా రెండూ తమ విభేదాలను పరిష్కరించుకునే సామర్థ్యాన్ని పూర్తిగా కలిగి ఉన్నందున, రష్యా తెరవెనుక నిర్మాణాత్మక పాత్రను పోషించాలనుకుంటుందని దౌత్యవేత్త సూచించారు. కాగా, చైనా-ఇండియా సరిహద్దు నుంచి వచ్చిన నివేదికలు “చాలా భయంకరమైనవి” అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతి‌‌న్‌ సెక్రటరీ డిమిత్రి పెస్కోవ్ అన్నారు.

భారత్‌, చైనా మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఘర్షణల కారణంగా ముగ్గురు విదేశాంగ మంత్రుల సమావేశం వాయిదా పడుతోందన్న ఊహాగానాల మధ్య రష్యా ఇండియా, చైనా (ఆర్‌ఐసీ) గ్రూపు ప్రాముఖ్యతను రష్యా పక్షం గుర్తించింది. "ఆర్‌ఐసీ యొక్క ఉనికి ఒక తిరుగులేని వాస్తవికత, ఇది ప్రపంచపటంలో దృఢంగా స్థిరపడింది. ద్వైపాక్షిక సహకారం యొక్క ప్రస్తుత దశ విషయానికొస్తే, అది స్తంభింపజేసే సూచనలు లేవు ”అని భారత్‌లో రష్యా రాయబారి నికోలాయ్ కుడాషేవ్ జూన్ 17 న ట్వీట్ చేశారు. 

ముగ్గురు విదేశాంగ మంత్రులు కోవిడ్ -19 మహమ్మారిని అనుసరించి ప్రపంచ రాజకీయ, ఆర్థిక పోకడలతో పాటు ప్రస్తుతమున్న సంక్షోభాన్ని అధిగమించే అవకాశాలపై చర్చిస్తారని ఆర్‌ఐసి వీడియో కాన్ఫరెన్స్‌కు సంబంధించి రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖారోవా చెప్పారు. 


logo