ఢిల్లీ ,జూన్ 7: ఫ్రాన్స్‌కు చెందిన విలాసవంతమైన కార్ల తయారీసంస్థ బుగాటి సరికొత్త ఫీచర్లతో అదిరిపోయే కార్ ను రూపొందించింది. రూ.100 కోట్ల విలువ చేసే కారులో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ వందకోట్లకారు ఫైనల్ వర్షన్‌కు చెందిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. లగ్జరీ కార్ల తయారీ సంస్థగా, అత్యంత ఖరీదైన కార్లను రూపొందించే కంపెనీగా ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో గుర్తింపు పొందిన బుగాటి.. ఈ కారును ఎప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ‘లా వొయిచర్ నొయిరె ‘(La Voiture Noire) పేరుతో ఈ ఖరీదైన కార్ ను తయారుచేసింది. ఫ్రెంచ్ భాషలో ‘లా వొయిచర్ నొయిరె ‘ అంటే బ్లాక్ కలర్ కారు అని అర్థం. దీనికి తగ్గట్టుగానే మిడ్ నైట్ బ్లాక్ కలర్లో తళుక్కున మెరిసేలా రూపొందించారు. బుగాటి నుంచి వెలువడిన ఈ బ్యూటీ కారు ధర అక్షరాలా 13.4 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో సుమారుగా 100 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈ కారును తయారు చేయడానికి బుగాటి కంపెనీకి 65 వేల ఇంజినీరింగ్ వర్కింగ్ అవర్స్ పట్టింది. అద్భుతమైన ఫీచర్లతో డిజైన్ చేశారు.